logo

అయిదు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు..!

రాష్ట్రానికి చెందిన అయిదు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Published : 27 Nov 2022 02:41 IST

త్వరలో నిపుణుల బృందం పరిశీలన

వెండి కళాకృతులు రూపొందిస్తున్న కళాకారులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి చెందిన అయిదు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో జరగనున్న సమావేశంలో సలహా సంఘం నిపుణులు వీటిని పరిశీలించనున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని చెన్నైకు చెందిన జీఐ రిజిస్ట్రీ ఆ వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం.. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రాథమిక పరిశీలన పూర్తయ్యింది. జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేసినవారితో డిసెంబర్‌ 6న నిపుణులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ ఉత్పత్తుల ప్రామాణికతను అంచనా వేయడంతోపాటు వాటిని నిర్ధారించనున్నారు. అనంతరం ఆయా పరిశీలన నివేదికలను దరఖాస్తుదారులకు అందించనున్నారు. అన్నీ అనుకూలంగా ఉండి ఉత్పత్తుల ఆధారాలు, ఇతరత్రా అంశాలు నిజమని రుజువైతే అభ్యంతరాల కోసం ప్రజలకు తెలిసేలా ప్రకటన జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా ఎవరి నుంచీ అభ్యంతరాలు రాకుంటే వాటికి జీఐని నమోదు చేయనున్నారు. సమావేశం నాటికి దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలన్నీ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించినట్లు జీఐ రిజిస్ట్రీ పేర్కొంది.

ఆ ఉత్పత్తులివే..

జీఐ పరిశీలనకు వెళ్లనున్న ఉత్పత్తుల జాబితాలో మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన ఎర్రచీమల పచ్చడి (కోయ్‌ చట్నీ), రసబలి వంటకం (కేంద్రపడ), మగ్జి (ఢెంకనాల్‌), వెండి కళాకృతులు (కటక్‌), ఈత బెల్లం (గజపతి) ఉన్నాయి. ఎర్ర చీమలతో తయారుచేసే పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలని, దీనిని తినడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవని అక్కడి గిరిజనులు బలంగా విశ్వసిస్తారు. ఢెంకనాల్‌ జిల్లాలోని గోండియా సమితిలో గేదె పాలతో తయారుచేసే మగ్జికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని స్థానికులు చెబుతుంటారు. గజపతి జిల్లాకు చెందిన ఈత బెల్లం ఎంతో రుచిగా ఉండటమే కాకుండా శరీరంలో ఐరన్‌, విటమిన్లు వృద్ధి చెందుతాయని చెబుతారు. ఆస్తమా, గ్యాస్ట్రిక్‌, దగ్గు తదితరాలను నయం చేసేందుకు తయారుచేసే ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తుంటారని స్థానికులు పేర్కొంటారు. వీటితోపాటు రసబలి, వెండి కళాకృతులు వాటి ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆయా ప్రాంతవాసులు చెబుతుంటారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని