logo

రెండు లారీలు ఢీ.. క్లీనర్‌ దుర్మరణం

కొరాపుట్‌-సునాబెడ మార్గంలో టింబర్‌ వంతెన వద్ద శనివారం ఉదయం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Published : 27 Nov 2022 02:41 IST

ధ్వంసమైన లారీ ముందుభాగం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌-సునాబెడ మార్గంలో టింబర్‌ వంతెన వద్ద శనివారం ఉదయం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సునాబెడ ఠాణా అధికారి ఉల్లాస్‌ చంద్ర రౌత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న, విశాఖ నుంచి జయపురం వెళ్తున్న లారీలు వంతెన వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ క్లీనర్‌ అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు డ్రైవర్లు, ఒక సహాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు వెళ్లి వాటిని తొలగించడంతో రాకపోకలు యథాతథంగా సాగాయి. మృతుడు, గాయపడిన వ్యక్తుల వివరాలు తెలియలేదు.


చెరువులో మునిగి బాలుడి మృత్యువాత

దాడి ఆరోపణలు..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా పట్టపూర్‌ ఠాణా పరిధిలోన డెంగాడి గ్రామంలో శనివారం మూడేళ్ల బాలుడు చెరువులో మునిగి మృతిచెందాడు. ఉదయం ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడు సమీపంలో చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయాడు. మధ్యాహ్నం చెరువులో బాలుడి మృతదేహం తేలియాడడం గమనించిన వీధి ప్రజలు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు హుటాహుటిన బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


బ్రహ్మపురలోని ఓ ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిపై కొందరు సీనియర్లు దాడి చేశారన్న ఆరోపణలపై గుసానినువాగాం ఠాణాలో బాధిత బాలుడి కుటుంబ సభ్యులు లిఖిత ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నిర్వాహక పాఠశాల యంత్రాంగంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండు చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు ఠాణా వద్ద ప్రదర్శన నిర్వహించి, వివిధ డిమాండ్లు చేశారు.


కుటుంబ కలహాలతో ఆత్మహత్య

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం స్థానిక సంబాయి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంబాయి కాలనీలో నివసిస్తున్న ప్రఫుల్ల కుమార్‌ దొళాయి (41) శుక్రవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికి, చివరికి ఠాణాలో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పెటుకోన మార్గంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఆయన మృతదేహం వేలాతుడుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హరప్రియ సబర్‌ సిబ్బందితో కలసి వెళ్లి అది ప్రఫుల్‌ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని