logo

‘మేకిన్‌ ఒడిశా’ సదస్సులో పర్యటక రంగం కీలకం

ఈ నెల 30 నుంచి భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే మేకిన్‌ ఒడిశా సదస్సులో పర్యటక రంగంలో పెట్టుబడులు కీలకమని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్వినీ పాత్ర్‌ చెప్పారు.

Published : 27 Nov 2022 02:41 IST

అశ్వినీ పాత్ర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఈ నెల 30 నుంచి భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే మేకిన్‌ ఒడిశా సదస్సులో పర్యటక రంగంలో పెట్టుబడులు కీలకమని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్వినీ పాత్ర్‌ చెప్పారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో మూడోరోజు శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రశాంతంగా ఏర్పాటైంది. సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ సభా కార్యక్రమాలు చేపట్టిన తర్వాత బిజద, భాజపా, కాంగ్రెస్‌లకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2018 మేకిన్‌ ఒడిశా సదస్సులో రాష్ట్రంలోని 122 పర్యటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారని, తర్వాత నక్షత్రాల హోటళ్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈసారి ఏర్పాటయ్యే సదస్సులో పర్యటక కేంద్రాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులపై చర్చ జరుగుతుందన్నారు. 2016లో ప్రభుత్వం పర్యటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిందన్నారు. దశలవారీగా అన్ని చారిత్రక పీఠాలను అభివృద్ధిలోకి తేవాలన్నది ధ్యేయమన్నారు. పూరీ, కోణార్క్‌, చిలికా, గోపాలపూర్‌, భువనేశ్వర్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో (పీపీ మోడ్‌) ఇటీవల కాలంలో నక్షత్రాల హోటళ్లు ఏర్పాటయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. పర్యటక కేంద్రాలకు మంచినీరు, రోడ్లు, విద్యుత్తు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నామన్నారు. మంత్రి సమాధానంతో కొంతమంది సభ్యులు సంతృప్తి చెందలేదు. బొలంగీర్‌, కొరాపుట్‌, బాలేశ్వర్‌ జిల్లాల్లో పర్యటక కేంద్రాలు అధ్వానంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి స్వయంగా ఆయాకేంద్రాలు పరిశీలించి పరిస్థితి అధ్యయనం చేయాలన్న సభ్యుల సూచనలకు మంత్రి అశ్వినీ అంగీకారం తెలిపారు.

అగ్నిమాపక సేవల సవరణ బిల్లు ఆమోదం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: శాసనసభలో శనివారం సాయంత్రం ‘అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2022’ ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు. మంత్రులు, అధికార, విపక్ష సభ్యులు తక్కువ మందే హాజరయ్యారు. ఉదయం సభా కార్యక్రమాల ప్రారంభంలో మొక్కుబడిగా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరుకాగా, మధ్యాహ్నానికి పద్మపూర్‌ ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ మంత్రి ప్రదీప్‌ అమత్‌ అగ్నిమాపక బిల్లు ప్రవేశ పెట్టారు. ఆ వెంటనే ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ సభా కార్యక్రమాలు సోమవారం వరకు వాయిదా వేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు