logo

‘తెలుగు పరిరక్షణకు ఉద్యమిద్దాం’

భవిష్యత్తు తరాలకు మనమిచ్చే ఆస్తి సాహిత్యం, కళలే అని, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులు, రచయిత జంధ్యాల శరత్‌బాబు పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 01:21 IST

శరత్‌బాబుకు జ్ఞాపిక అందిస్తున్న మహేష్‌. పక్కన ఆనందరావు తదితరులు

రాయగడ, న్యూస్‌టుడే: భవిష్యత్తు తరాలకు మనమిచ్చే ఆస్తి సాహిత్యం, కళలే అని, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులు, రచయిత జంధ్యాల శరత్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం రాయగడకు చెందిన స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 27వ వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు భాషా పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కొన్ని ప్రాంతాల్లో సాహితీ సంస్థలు మనుగడ కోల్పోతుండగా, రాయగడలో ‘స్పందన’ 27 వసంతాలుగా సుదీర్ఘ సేవలందింస్తుండటం విశేషమన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రతీ ఇంటి నుంచి ఉద్యమం ప్రారంభించాలన్నారు. ఇందులో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ‘స్పందన’ అధ్యక్షుడు ఆనందరావు కుమందాన్‌ మాట్లాడుతూ కవులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన పురాధ్యక్షుడు మహేష్‌ పట్నాయక్‌ ప్రసంగిస్తూ స్పందన కళాకారులతో తాను కూడా నటించడం గర్వకారణమన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు గుడ్ల గౌరీప్రసాద్‌, సాంస్కృతిక కార్యదర్శి కొండవలస కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్‌లు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందించారు. రారసం అధ్యక్షుడు టీవీఎన్‌ఆర్‌ అప్పారావు, సాహితీ, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


ఆంధ్ర మహాభారతం గొప్ప రచన

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: రాష్టేతర తెలుగు సమాఖ్య (రాతెస) ఆధ్వర్యంలో అంతర్జాల మాధ్యమంలో శని, ఆదివారాల్లో ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది వేడుకలు నిర్వహించారు. ముందుగా సంస్థ అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్‌ ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రనలను స్మరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ తెలుగు భాష పట్ల రాజరాజ నరేంద్రునికి గల అభిమానాన్ని కొనియాడారు. మహాభారతం గొప్పతనాన్ని వివరించారు. ఆచార్య పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, ఆచార్య గిరిజా మనోహర్‌ బాబు, ఆచార్య వి.నాగ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ ప్రభల జానకి, జి.నారాయణ, డీజీపీ డాక్టర్‌ బీఎన్‌ రమేష్‌, గరికపాటి గురజాడ, లేళ్లపల్లి శ్రీదేవి, డాక్టర్‌ వేదాల గాయత్రీ దేవి, డాక్టర్‌ పీవీ ఉమా శశి తదితరులు ప్రసంగించారు.


ద్రౌపది సహనం మహిళలకు ఆదర్శం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు బ్రహ్మపురకు చెందిన ప్రముఖ సాహితీవేత్త తుర్లపాటి రాజేశ్వరి అధ్యక్షత వహించారు. ‘మహా భారతంలో ద్రౌపది’ అంశంపై మాట్లాడుతూ విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. ద్రౌపది సహనం, సాహసం, ఓర్పు, నేర్పు మహిళలకు ఆదర్శమన్నారు. శనివారం నిర్వహించిన సదస్సులో బ్రహ్మపురకు చెందిన తెలుగు పండితుడు కొల్లూరి నారాయణరావు పాల్గొని ‘మహాభారతంలో ధర్మరాజు పాత్ర’ను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని