logo

యుద్ధ ప్రాతిపదికన నాట్యమండపం పనులు

పూరీ శ్రీక్షేత్రం నాట్య మండపం గోపురంలో స్వల్పంగా పగుళ్లున్నాయని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) సుపరింటెండు అరుణ్‌ మల్లిక్‌ చెప్పారు.

Published : 28 Nov 2022 01:21 IST

బొడదండొలో ఏఎస్‌ఐ, ఇతర అధికారులు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రం నాట్య మండపం గోపురంలో స్వల్పంగా పగుళ్లున్నాయని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) సుపరింటెండు అరుణ్‌ మల్లిక్‌ చెప్పారు. ఆదివారం సాయంత్రం హైకోర్టు ద్వారా నియమితులైన అమికస్‌ క్యూరీ ఎన్‌.కె.మహంతి, ఐఐటీ చెన్నై ఇంజినీరు అరుణ్‌ మీనన్‌, ఏఎస్‌ఐ నిపుణులు శ్రీక్షేత్రం సందర్శించారు. సెప్టెంబరు 17న హైకోర్టు పూరీ ఆలయం మరమ్మతులు 2023 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. పర్యవేక్షణకు అమికస్‌ క్యూరీగా మహంతిని నియమించిన సంగతి తెలిసిందే. గత నెల శ్రీక్షేత్రం సందర్శించిన మహంతి నాట్య గోపురంలో పగుళ్లున్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐ పనులు చేపట్టాల్సి ఉండగా, నిపుణులు అన్ని కోణాల్లో పరిశీలించారు. అనంతరం ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ మల్లిక్‌ విలేకరులతో మాట్లాడుతూ... నాట్య గోపురం పైకప్పు స్తంభంలో ఒక చోట 5 ఇంచీల పగుళ్లున్నాయని, రసాయన ప్లాస్టరింగ్‌ పనులూ చేపట్టాల్సి ఉందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మార్చి కల్లా మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. జగ్మోహన (గర్భగుడి) రత్న సింహాసనం వద్ద స్వల్ప మరమ్మతులు అవసరమన్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు సింహాసనంపై ఆసీనులై ఉన్నందున ఇప్పుడు పనులు సాధ్యంకావని, రథయాత్రగా ముగ్గురు మూర్తులు గుండిచా మందిరానికి తరలిన తర్వాత మరమ్మతులు జరుగుతాయన్నారు. గర్భగుడి గోపురం పైకప్పు దృఢంగా ఉందని, కేవలం రత్నసింహాసనం వద్ద రసాయన ప్లాస్టరింగ్‌ పనులు రథయాత్ర సమయంలో చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని