logo

గల్లీ నుంచి వెండితెర వరకు

ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు బ్రహ్మపుర నగరానికి చెందిన నృత్యకళాకారుడు సునీత్‌ కుమార్‌ దాస్‌.

Published : 28 Nov 2022 01:21 IST

చిత్ర నృత్య దర్శకుడిగా రాణిస్తున్న సునీత్‌ కుమార్‌ దాస్‌
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న బ్రహ్మపుర వాసి


‘ఊంచాయి’ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఇతర సీనియర్‌ నటులతో డాన్స్‌ వేస్తున్న దాస్‌

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు బ్రహ్మపుర నగరానికి చెందిన నృత్యకళాకారుడు సునీత్‌ కుమార్‌ దాస్‌. స్థానిక శక్తినగర్‌ మూడోలైనుకు చెందిన దాస్‌ తొలుత రిథమ్‌ డాన్స్‌, ప్రిన్స్‌ డాన్స్‌ బృందాల్లో ఉండి శిక్షణ పొందుతూ పలు షోల్లో రాణించాడు. తన నృత్యానికి ఇంకా మెరుగులు దిద్దుకోవాలని, ఉన్నత స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో 2013లో ముంబయికి పయనమయ్యాడు. అక్కడ నృత్య గురువులతో పరిచయం పెంచుకుని పలు డాన్స్‌ షోల్లో ప్రదర్శనలిస్తూ బాలీవుడ్‌ ప్రముఖుల కళ్లల్లో పడ్డాడు. కొన్ని హిందీ చిత్రాల్లో బృంద డాన్సర్లలో ఒకరిగా నృత్యం చేశాడు.

సునీత్‌ కుమార్‌ దాస్‌


అమితాబ్‌తో స్టెప్పులు

తన ప్రతిభను గుర్తించిన కొందరు డైరెక్టర్లు దాస్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, ఇతర సీనియర్‌ నటులు నటించిన ‘ఊంచాయి’ చిత్రంలో కేటికొ అనే పాటకు సహ కొరియోగ్రాఫర్‌గా దాస్‌ పని చేశాడు. బచ్చన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా దాస్‌ ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడుతూ.. నృత్యంపైనున్న ఆసక్తే తనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పాడు. ముంబయిలోనే ఉంటున్న తాను ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్లు రెమో డిసౌజా, ఫరా ఖాన్‌, అహ్మద్‌ఖాన్‌ తదితరుల వద్ద సహ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ పలు పాటల్లో వారి పర్యవేక్షణలో ప్రముఖ నటులకు నృత్యాలు నేర్పిస్తున్నట్లు చెప్పారు. అమితాబ్‌తో కలసి నృత్యం చేయడం గర్వంగా ఉందన్నారు. పాఠశాల, కళాశాల చదువుతున్న రోజుల్లో స్థానిక రిథమ్‌ డాన్స్‌ గ్రూప్‌లో చేరి నృత్యగురువు అప్పన మహరణా వద్ద శిక్షణ పొందానని, అలాగే జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన ప్రిన్స్‌ డాన్స్‌ గ్రూప్‌లో కృష్ణమోహన్‌ రెడ్డి తర్ఫీదులో పలు జాతీయ షోల్లో తన నృత్య ప్రతిభను చూపానని పేర్కొన్నారు. అలా 2016 నుంచి హిందీ చిత్రాల్లో సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రముఖ హీరోలు ధనుష్‌, సల్మాన్‌ ఖాన్‌, టైగర్‌ ష్రాఫ్‌ తదితరులకు కొరియోగ్రఫీ చేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని దాస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని