logo

ప్రభుత్వానిది మొసలి కన్నీరు

అన్నదాతలకు అన్యాయం చేస్తున్న బిజద పెద్దలు కేంద్రంపై విమర్శలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, 23 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశ్నించారు.

Published : 28 Nov 2022 01:21 IST

పద్మపూర్‌ ప్రచారంలో.. కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్‌, అశ్వినీ వైష్ణవ్‌ విమర్శలు

వేదికపై కేంద్రమంత్రులు నరేంద్ర, అశ్వినీ, ఎంపీలు, ప్రదీప్‌ పురోహిత్‌, ఇతర నాయకులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అన్నదాతలకు అన్యాయం చేస్తున్న బిజద పెద్దలు కేంద్రంపై విమర్శలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, 23 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశ్నించారు. ఆదివారం పద్మపూర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పైకమాల్‌లో ఏర్పాటైన బహిరంగ సభలో తోమార్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోమర్‌ మాట్లాడుతూ... గతేడాది విపత్తుల మూలంగా నష్టాలు చవిచూసిన రైతులకు కేంద్రం పీఎం ఫసల్‌ బీమా సొమ్ము అందజేసిందని ప్రభుత్వం అర్హులకు ఆ మొత్తాన్ని అందజేయకుండా పక్కతోవ పట్టించారని దుయ్యబట్టారు. పశ్చిమ ఒడిశా అన్నదాతలను ఉపేక్షించిన నవీన్‌ సర్కార్‌ పద్మపూర్‌ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్‌ సబ్సీడీ) పేరిట రూ.200 కోట్లు ప్రకటించినా ఇంతవరకు ఎవరికీ సాయం అందలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ పాలన ఉండుంటే ఒడిశాకు ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. పద్మపూర్‌లో భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ను గెలిపించాలని, 2024 సాధారణ ఎన్నికల్లో భాజపాకు పాలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

స్థలం కేటాయించకుండా పనులెలా సాధ్యం

రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి స్థలం కేటాయింపు, అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందన్నారు. స్థలం లేకుండా పనులు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. జగన్నాథుడి నిలయమైన ఈ నేలపై ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని, ఆయన ఒడిశాకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. పశ్చిమ ఒడిశాలోని 13 రైల్వే స్టేషన్లకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించాలన్న ధ్యేయంతో పనులు ప్రారంభించామన్నారు. ‘పద్మపూర్‌, బరగఢ్‌లో రైల్వే లైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు(ఆదివారం) స్థలం కేటాయిస్తే రేపు(సోమవారం) పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఉటంకించారు. ఈ సభలో బరగఢ్‌ ఎంపీ సురేశ్‌ పూజారి, బొలంగీర్‌ ఎంపీ సంగీతా కుమారీ సింగ్‌ దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.


గిరిజన సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం: సరక

పద్మపూర్‌ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సరక, ఇతర బిజద నేతలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివాసీల సామాజిక, ఆర్థిక వికాసానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి జగన్నాథ సరక చెప్పారు. ఆదివారం పద్మపూర్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహను గెలిపించాలని ఓటర్లను కోరారు. పద్మపూర్‌ ఎన్‌ఏసీలో ఏర్పాటైన సభలో సరక మాట్లాడుతూ... పద్మపూర్‌లో 80వేల మంది ఆదివాసీలున్నారని, వారి ప్రయోజనాలకు బర్షా కట్టుబడతారని చెప్పారు. ఈ ప్రాంతాభివృద్ధికి సీఎం ఎంతో చేయాలన్న ధ్యేయంతో ఉన్నందున బర్షాను గెలిపించాలని కోరారు. సభలో పద్మపూర్‌ ప్రాంత బిజద నాయకులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని