logo

మహేంద్రగిరికి జీవవైవిధ్య వారసత్వ హోదా

గజపతి జిల్లాలోని మహేంద్రగిరి పర్వతాలను జీవవైవిధ్య వారసత్వ హోదాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడున్న ఆవాసాలు, అమూల్యమైన వృక్ష జాతులు, జంతు సంపదను సంరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 28 Nov 2022 01:22 IST

రాష్ట్రంలో రెండో కేంద్రంగా గుర్తింపు

కుంతి దేవాలయం వద్ద భక్తులు

పర్లాఖెముండి, కాశీనగర్‌, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలోని మహేంద్రగిరి పర్వతాలను జీవవైవిధ్య వారసత్వ హోదాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడున్న ఆవాసాలు, అమూల్యమైన వృక్ష జాతులు, జంతు సంపదను సంరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొంధమాల్‌ జిల్లాలోని మందసారు ప్రాంతం తర్వాత ఈ హోదా లభించిన రెండో కేంద్రంగా మహేంద్రగిరి గుర్తింపు పొందింది. చారిత్రక, పౌరాణిక, పురావస్తు, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వత శ్రేణి గజపతి జిల్లాలోని రాయగడ సమితిలో ఉంది. రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఈ హోదా కోసం గతంలో అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖకు సిఫార్సు చేసింది. దీంతోపాటు గండాహతి బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ (బీఎంసీ), మోహన శాసనసభ్యులు, పర్లాఖెముండి డీఎఫ్‌ఓ, స్వచ్ఛంద సంస్థ ‘లిపిక’ ప్రతిపాదనలు పంపినట్లు ఆ శాఖ వెల్లడించింది.

అరుదైన వృక్షాలకు నిలయం...

సముద్రమట్టానికి 1000 మీటర్ల ఎత్తులో గల మహేంద్రగిరిలో దాదాపు 4250 హెక్టార్ల విస్తీర్ణంలో రెండు అడవులు (ఇడోంగిరి, మహేంద్రగిరి)న్నాయి. వాటిలో 1358 రకాల మొక్కలు, 388 రకాల జంతువులు ఉన్నాయని బీఎంసీ చేసిన ప్రతిపాదనను 2020 సెప్టెంబర్‌ 13న జరిగిన గ్రామసభలో ఆమోదించినట్లు ఆ శాఖ తెలిపింది. ప్రపంచంలోని 40 శాతం వృక్ష జాతులు ఇక్కడే ఉన్నాయి. అక్కడి అడవుల్లో 112 కుటుంబాలకు చెందిన 1,042 రకాల యాంజియోస్పెర్మ్‌లు, 300 రకాల ఔషధ గుణాలున్న మొక్కలు, 60 రకాల టెరిడోఫైట్స్‌, 104 రకాల బ్రయోఫైట్స్‌, 53 జాతుల లైకెన్లు, 72 రకాల స్థూల-శిలీంధ్రాలు తదితరాలున్నాయి. 165 రకాల పక్షులు, 100 జాతుల సీతాకోకచిలుకలు, 60 రకాల సరీసృపాలు, 27 రకాల క్షీరదాలకు ఆవాసం కల్పిస్తున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని 5 రకాల చెట్లు ఇక్కడుండటం గమనార్హం.


19 శాతం ప్రజలకు జీవనాధారం...

మహేంద్రగిరి పర్వత శ్రేణి

ఈ కొండపై కుంతి, భీముడు, అర్జునుడు, యుధిష్ఠరులు కొలువైన పురాతన ఆలయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 1958లో ఆ స్థలాన్ని చారిత్రక ప్రదేశంగా ప్రకటించి పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టింది. ఇక్కడకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దట్టమైన అడవులు, కొండలు, సెలయేళ్లు, నదులతో కూడిన ఈ పర్వత శ్రేణిని ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా పిలిచేవారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 19 శాతం ప్రజలు ఈ పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్నారు. విశాలమైన అడవుల్లో గుగ్గిలం, ఎగిస, టేకు, గంధం, కంగోడా, ఇరిడి తదితర భారీ వృక్షాలున్నాయి. ఏనుగులు, మొసళ్లు, కోతులు, పాములు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసం. ప్రత్యేకించి ఇక్కడ ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని గజపతి అని పిలిచేవారు. ఇక్కడి లభిస్తున్న ఔషధీయ మొక్కల సంరక్షణ కోసం చాలా కాలంగా స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ హోదా కల్పించడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యటక పరంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని