logo

రేపటి నుంచి మేకిన్‌ ఒడిశా సదస్సు

పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం భువనేశ్వర్‌ జనతా మైదానం వేదికగా బుధవారం నుంచి 5 రోజులపాటు మేకిన్‌ ఒడిశా సదస్సు నిర్వహిస్తోంది.

Published : 29 Nov 2022 02:38 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం భువనేశ్వర్‌ జనతా మైదానం వేదికగా బుధవారం నుంచి 5 రోజులపాటు మేకిన్‌ ఒడిశా సదస్సు నిర్వహిస్తోంది. గతంలో 2017, 2018లలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు కాగా, ఇది మూడోసారి. పరిశ్రమలశాఖ ఈ సదస్సు నిర్వహణకు మూడు నెలలుగా ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, ఇతర అధికారులు సోమవారం మైదానాన్ని పరిశీలించారు.

అందరికీ ఆహ్వానాలు

ముఖ్యమంత్రి నవీన్‌ ఇటీవల దుబాయ్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు నగరాల్లో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి మేకిన్‌ ఒడిశా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్‌కు దేశ, విదేశాలకు చెందిన 200 మందికిపైగా పారిశ్రామికవేత్తలు, సీఈవోలు వస్తారని అంచనా.

మూడు రోజులు కీలకం

బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి మేకిన్‌ ఒడిశా సదస్సు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యుత్తు, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్‌దేవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి హేమంతశర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తదితర అధికారులు పాల్గొంటారు. గురువారం నుంచి శనివారం వరకు వేదికపై పరిశ్రమలకు సంబంధించి ప్లీనరీ సమావేశాలు నిర్వహించి చర్చిస్తారు. ఈ మూడు రోజులు కీలకం. చివరి రోజు ఆదివారం సాధారణ ప్రజలంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేకిన్‌ ఒడిశా సదస్సులో భాగంగా జనతా మైదానంలో పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖల యంత్రాంగాలు రాష్ట్రంలోని ఖనిజ సంపద, అటవీ, సాగర ఉత్పత్తులు, పర్యటక రంగం, ఐటీ శాఖలకు సంబంధించి ప్రదర్శనా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దృశ్యమాధ్యమాల ద్వారా ఇవి తిలకించేలా సన్నాహాలు చేశారు.

ఎంఓయూలకు అవకాశం

డిసెంబరు 1 నుంచి 3 వరకు పరిశ్రమలు, విద్యుత్తు, గనులు, ఐటీ, పర్యటకం, రాకపోకలు, రసాయనాలు, జౌళి, వ్యవసాయం ఉపకరణాలు, ఆహోరోత్పత్తులు, సౌరశక్తి, పెట్రోలియం, వైద్య ఉపకరణాలు, బయోటెక్నాలజీ, ఫిల్మ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, ప్లాస్టిక్‌ తదితరాలపై పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు. సింగిల్‌విండో కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఒకేచోట అనుమతులు ఇస్తారు. ఈ నేపథ్యంలో సదస్సులో కీలక ఒప్పందాలకు అవకాశం ఉంది.

పరిశ్రమలశాఖ మంత్రి ప్రతాప్‌ సోమవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం మేకిన్‌ ఒడిశా సదస్సును  ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని చెప్పారు. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులొస్తాయన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. ఖనిజ సంపద, తీర సంపద, అటవీ ఉత్పత్తులు, ఓడరేవులు, ఎయిర్‌, రోడ్‌ అనుసంధానం తదితర సౌకర్యాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నందున మంచి ఫలితాలు తథ్యమన్న నమ్మకం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు