logo

23 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?

ఎంతో చేశాం, ఇంకా చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తన 23 ఏళ్ల పాలనాకాలంలో రైతులకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలిగారా?

Published : 30 Nov 2022 02:08 IST

నవీన్‌ పాలనపై ధర్మేంద్ర విమర్శనాస్త్రాలు


అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర, ఎంపీలు సురేష్‌, బసంత పండా, ప్రదీప్‌ పురోహిత్‌, సమీర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఎంతో చేశాం, ఇంకా చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తన 23 ఏళ్ల పాలనాకాలంలో రైతులకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలిగారా? అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు. పద్మపూర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో మంగళవారం మూడు రోజుల ప్రచారానికి వచ్చిన కేంద్రమంత్రి నవీన్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మిషన్‌శక్తి కార్యక్రమం ద్వారా మహిళల్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చామని చెప్పుకొంటున్న సీఎం మహిళలపై జరుగుతున్న అత్యాచార సంఘటనలపై ఏం సమాధానం చెప్తారని, హోంశాఖ పర్యవేక్షిస్తున్న ఆయన బాధ్యత వహించాలని పద్మపూర్‌ బహిరంగ సభలో పేర్కొన్నారు. 2019లో రాష్ట్రంలో మహిళలపై 2,950 అత్యాచార ఘటనలు జరగ్గా, 2020లో 2,984, 2021లో 3,327 సంఘటనలు జరిగాయని కేంద్ర మంత్రి ఆధారాలు చూపించారు. అన్నదాతల సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సద్వినియోగం కావడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ ఆరోపించారు. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పశ్చిమ ఒడిశా యువకులు ఉపాధి లేక వలస బాట పడుతుండడం వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. పశ్చిమ ఒడిశా వికాస్‌ పరిషత్‌ (డబ్ల్యూఓడీసీ) కార్యాలయాన్ని భువనేశ్వర్‌లో కొనసాగించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీశారు. సిరిసంపదలకు నిలయమైన ఒడిశా రూ.లక్ష కోట్ల అప్పులు చేయడం, ప్రజలపై తలసరి రూ.25 వేల రుణ భారంపై ముఖ్యమంత్రి ఏం సమాధానమిస్తారని నిలదీశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల ప్రజలు, రైతులకు తాను స్వయంగా న్యాయం చేస్తానంటున్న నవీన్‌ బిజేపూర్‌, బాలేశ్వర్‌, పిపిలి, ధామ్‌నగర్‌లకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టి మాయచేయగలరని ప్రశ్నించిన కేంద్ర మంత్రులు బిజద పాలనకు కాలం చెల్లిందని, పద్మపూర్‌ ఓటర్లు స్థానిక రైతు నేత ప్రదీప్‌ పురోహిత్‌ను గెలిపించాలని కోరారు. బహిరంగసభలో భాజపా ఎంపీలు బసంత పండా, సురేష్‌ పుజారి, శాసనసభలో విపక్ష నేత జయనారాయణ మిశ్ర, భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సమీర్‌ మహంతి తదితర నాయకులు పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని