logo

భువనేశ్వర్‌లో ఆశా కార్యకర్తల గర్జన

విపత్తుల సమయంలో, పౌష్టికాహారం పంపిణీలో శాయశక్తులా కష్టపడుతున్నామని, తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరారు.

Published : 30 Nov 2022 02:08 IST

పీఎంజీ వద్ద మండుటెండలో నినాదాలు చేస్తున్న ఆశా కార్యకర్తలు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: విపత్తుల సమయంలో, పౌష్టికాహారం పంపిణీలో శాయశక్తులా కష్టపడుతున్నామని, తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరారు. మంగళవారం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని పీఎంజీ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొనడంతో పీఎంజీ జనసంద్రమైంది. మండు టెండలోనూ వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించారు. ఆందోళనకు నేతృత్వం వహించిన బీఎంఎస్‌ నేత బసంత సాహు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, సామాజిక భద్రతా, ఈపీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ విరమణ చేసినవారికి రూ.5 లక్షలు అందించాలని, నెలకు రూ.5 వేలు పింఛను ఇవ్వాలని, ప్రమాదాల్లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఒడిశా ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు మమతా మహంతి, కార్యదర్శి కమలా బెహరా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని