logo

నేర వార్తలు

వారిద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి. పిల్లలున్నారు. కానీ పెళ్లయిన తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించడంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయి కలసి ఉంటున్నారు.

Published : 30 Nov 2022 02:08 IST

వివాహితను ప్రేమించాడు.. కడతేర్చాడు..!

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: వారిద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి. పిల్లలున్నారు. కానీ పెళ్లయిన తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించడంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయి కలసి ఉంటున్నారు. ఆకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రాణంగా ప్రేమించిన వివాహితను హతమార్చి పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటన ఖరగ్‌పూర్‌ గ్రామీణ ఖేమాసూలీ పరిధిలోని బాలూక్మాచా గ్రామంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలూక్మాచాకి చెందిన ప్రతిభా సింగ్‌ (32) తరుణ్‌ సింగ్‌లు అనేక రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులను వదిలి అదే గ్రామంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం నుంచి ప్రతిభ కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తరుణ్‌సింగ్‌ని అదుపులో తీసుకొని విచారించగా ఆమెను చంపి, పాతిపెట్టినట్లు తేలింది. మృతదేహాన్ని బయటకు తీయించి పరీక్షకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


యువకుడి బలవన్మరణం

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా ముకుందపూర్‌ పోలీసు అవుట్‌పోస్టు పరిధిలోని సరబగూడ  గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన లింగాని సొబొరొ (22) సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చేసరికి లింగాని ఉరికి వేలాడుతున్నాడని ఆయన తండ్రి లక్య సొబొరొ ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడి మృతికి కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని దర్యాప్తు అధికారి సంతోష్‌ తెలిపారు.


న్యాయవాదికి బెదిరింపు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక బి.ఎన్‌.పూర్‌ ఠాణా పరిధిలోని సిద్ధార్థనగర్‌లో సోమవారం సాయంత్రం ఓ న్యాయవాదిని కొందరు యువకులు అటకాయించారు. ఓ కేసులో వాదించవద్దని ఆయనను హెచ్చరించడంతోపాటు పిస్తోలు గురిపెట్టి, న్యాయవాది ధరించిన బంగారు గొలుసును లాక్కుపోయారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఆయన ఠాణాలో ఫిర్యాదు చేశారు.

బాలుడి మృతి.. గంజాం జిల్లా బెల్లుగుంఠ ఠాణా పరిధిలో బంకబజారులోని పిల్లాఖాయి చెరువులో సోమవారం ఓ బాలుడు (4) మునిగి మృతిచెందాడు. నాలుగు నెలల క్రితం బాలుడి తండ్రి అనారోగ్యంతో మృతిచెందిన సంగతి గమనార్హం.


‘వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్యాయత్నం’

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్‌ గ్రామీణ ప్రాంతంలోని జక్‌పూర్‌ రైలు వంతెనపై ఈనెల 25న అర్ధరాత్రి ట్రక్కు సహాయకుడిపై హత్యాయత్నం చేసిన ఘటనలో ఆ వాహన డ్రైవరే నిందితుడని ఎస్పీ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ఆయన సోమవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ‘‘ట్రక్కు సహాయకుడు నజ్ముల్‌పై ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి, రూ.6 వేల నగదు లాక్కొని పరారయ్యారని డ్రైవర్‌ అమానుర్‌ హక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి ఇదంతా నజ్ముల్‌ భార్య తమన్నా బీబీ, అమానుర్‌ హక్‌ ఆడిన నాటకమని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుడి తలపై స్క్రూడ్రైవర్‌తో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోల్‌కతా పీజీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరిచి తొమ్మిది రోజుల రిమాండ్‌కు తీసుకున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి వాస్తవాలను వెలికితీసిన ఖరగ్‌పూర్‌ గ్రామీణ పోలీసులకు ఎస్పీ రూ.10 వేల నగదు పురస్కారం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని