logo

జిల్లాల ఏర్పాటులో జాప్యమెందుకు?

కొత్త జిల్లాల ఏర్పాటుకు నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని, పద్మపూర్‌ ప్రాంత ప్రజల డిమాండు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు.

Published : 02 Dec 2022 03:30 IST

పద్మపూర్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌ రోడ్‌షో

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుకు నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని, పద్మపూర్‌ ప్రాంత ప్రజల డిమాండు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు. గురువారం పద్మపూర్‌ సమితి గ్రామాల్లో ఆయనరోడ్‌ షోలు, సమావేశాలు నిర్వహించి భాజపా అభ్యర్థి ప్రదీప్‌ తరఫున ప్రచారం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన భాజపాకు ఓట్లేయాలన్నారు. 2024లో కేంద్రం, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల ఏర్పాటు తథ్యమన్నారు. నవీన్‌ మాదిరి హామీలిచ్చి విస్మరించడం భాజపాకు అలవాటు లేదని, చెప్పింది చేయడానికి అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికలకు 18 నెలల వ్యవధి ఉండగా, పద్మపూర్‌లో పరిష్కారానికి నోచుకోని సమస్యలపై శాసనసభలో ఉద్యమించడానికి భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ను గెలిపించాలని ధర్మేంద్ర ఓటర్లకు విన్నవించారు.


నేడు పద్మపూర్‌లో నవీన్‌ ప్రచారం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం పద్మపూర్‌ ఉప ఎన్నిక ప్రచారం చేయనున్నారు. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహకు మద్దతుగా సీఎం పద్మపూర్‌, ఝార్బంధ్‌ సమితుల్లో ఏర్పాటేయ్య బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. శనివారం సాయంత్రంతో ఇక్కడ ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని