logo

నేటితో ప్రచారానికి తెర

బర్‌గఢ్‌ జిల్లా పద్మపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగియనుంది. శుక్రవారం బిజద, భాజపా, కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు.

Published : 03 Dec 2022 00:54 IST

కులాల ఓట్లపై నేతల దృష్టి

శుక్రవారం పద్మపూర్‌ ఎన్నికల సభలో మంత్రులు రీతాసాహు, రాజేంద్ర డాన్మీయా తదితర నేతల సమక్షంలో మాట్లాడుతున్న బర్షా

భువనేశ్వర్‌, బరగఢ్‌, న్యూస్‌టుడే: బర్‌గఢ్‌ జిల్లా పద్మపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగియనుంది. శుక్రవారం బిజద, భాజపా, కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఈ ఎన్నికలో కులాల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములకు నిర్ణయాత్మకం కానున్నాయి. ఆయా తెగల ఓట్లను పొందేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. 5వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. 8న లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

లక్షకుపైగా మూడు తెగల ఓట్లు

పద్మపూర్‌లో మెహర్‌, కులత, బింజార్‌ కులాల ఓట్లు లక్షకుపైగా ఉన్నాయి. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహ బింజార్‌ తెగ మహిళ. కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యభూషణ్‌ సాహు మెహర్‌ కులానికి చెందినవారు. భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ అగ్రవర్ణానికి చెందిన నేత. కులాల ఓట్లు చేజిక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు ఆయా తెగల పెద్దలతో మాట్లాడారు. ఈ రేసులో బిజద ముందంజలో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కులత తెగ పెద్దలు భువనేశ్వర్‌లో కలిశారు. జగన్నాథుడు తమ ఆరాధ్యుడని, తరచూ పూరీకి రాకపోకలు చేస్తున్నామని, వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో సీఎం ఎకరా స్థలం కేటాయిస్తున్నట్లు, భవన నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు భాజపా నేతలూ హామీలిస్తున్నారు. భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి శుక్రవారం పద్మపూర్‌లో ప్రచారం చేశారు. ఆమె ఇక్కడి మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు మెహర్‌, కులత, బింజార్‌ కులాల పెద్దలతో సమావేశమై భాజపాకు ఓట్లు వేయాలని కోరారు. 2001లో అపరాజిత బరగఢ్‌ కలెక్టరుగా విధులు నిర్వహించి మంచి పనులు చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారం భాజపా అభ్యర్థి ప్రదీప్‌కు కలిసొస్తుందని నాయకులు విశ్వాసంతో ఉన్నారు.

మాపట్ల కృతజ్ఞతాభావం

మాజీ మంత్రి, బట్లీ ఎమ్మెల్యే సుశాంతసింగ్‌ శుక్రవారం పద్మపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని కులాలు బిజద పక్షాన ఉన్నాయని, ముఖ్యమంత్రి వారి సంక్షేమానికి కృషి చేశారని, అందువల్ల వారిలో కృతజ్ఞతాభావం ఉందన్నారు.

మార్పు కోరుకుంటున్నారు

సుందర్‌గఢ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం శుక్రవారం పద్మపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత ఓటర్లు మార్పు కోరుకుంటున్నారన్నారు. అంతా భాజపా పక్షాన ఉన్నారన్నారు. అభ్యర్థి విజయంలో కీలకమైన కులాల ఓటర్లు ప్రదీప్‌కు అనుకూలంగా ఉన్నారన్నారు. బర్షా పొరుగు జిల్లా కోడలు కావడంతో పద్మపూర్‌కి ఏమీ చేయలేరన్న అనుమానాలు ఓటర్లలో ఉన్నాయన్నారు.

కాంగ్రెస్‌కు అనుకూలం

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత సంతోష్‌ సింగ్‌ సలూజ శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పద్మపూర్‌లో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందన్నారు. కులాల కుంపట్లు పని చేయవని, బిజద, భాజపాల హామీలు బూటకమని విశ్వసించిన ఓటర్లు కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తారని, సత్యభూషణ్‌కు గెలిపిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని