logo

ఓటీయం పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ప్రభుత్వం ఈ నెల 5వ తేదీలోగా చౌద్వార్‌ ప్రాంతంలో ఉన్న మూతపడిన ఓటీయం (ఒడిశా టెక్స్‌టైల్‌ మిల్‌)ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

Published : 04 Dec 2022 02:19 IST

హైకోర్టు ఆదేశం

కటక్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఈ నెల 5వ తేదీలోగా చౌద్వార్‌ ప్రాంతంలో ఉన్న మూతపడిన ఓటీయం (ఒడిశా టెక్స్‌టైల్‌ మిల్‌)ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందులో పనిచేసిన సిబ్బందికి, పరిశ్రమల వాటాదారుల కోసం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.150 కోట్లు బ్యాంకులో జమ చేసినా ఇంతవరకు ఎందుకు పరిశ్రమను ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం సూచించిన గడువులోగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే నెలకు రూ.5 లక్షలు చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించింది. ఒకప్పుడు ఈ మిల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండేది. ఇక్కడ తయారు చేసే వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేది. వందల సంఖ్యలో ఉద్యోగులు పరిశ్రమలో పనిచేసేవారు. 40 ఏళ్ల క్రితం మూసివేశారు. దీంతో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారు. ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఏళ్ల తరబడి పరిశ్రమ ప్రవేశ ద్వారం వద్ద ఉద్యోగులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై హైకోర్టులో నమోదైన కేసును ఇటీవల కోర్టు విచారించి ఉద్యోగుల పరిహారం కోసం రూ.150 కోట్లు బ్యాంకులో జమ చేయాలని, డబ్బు పంపిణీకి లిక్విడేటర్‌, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ను నియమించి ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం రూ.150 కోట్లు జమచేసింది. ఉద్యోగులకు పరిహారం పంపిణీ చేయలేదు. దీనిపై నమోదైన కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది.


న్యాయమూర్తి సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమితిలోని మాలి పర్వతంపై బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన అనుమతుల కోసం రాష్ట్ర కాలుష్య బోర్డు మరోసారి గ్రామ సభ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌ 23న నిర్వహించిన సభ సంతృప్తికరంగా జరగలేదని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 15 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. సిమిలిగుడ తహసీల్దార్‌ జ్యోతి రాణి రథొ మాట్లాడుతూ జిల్లా జడ్జి, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ కమిషనర్‌ సమక్షంలో శిబిరాన్ని మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్‌ 7న దీనిపై ప్రకటన జారీ చేసి, నెల రోజులు అభ్యంతరాల గడువు ఉంటుందని అనంతరం సభ జరిగే తేదీ, ప్రదేశం నిర్ణయిస్తామన్నారు. 2012 నుంచి మాలిపై బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి మద్దతు దారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్‌ 22న ప్రజా అభిప్రాయ సేకరణ శిబిరం ఏర్పాటు చేయగా వ్యతిరేకులు అధికారులపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సభ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని