logo

కోణార్క్‌ ఉత్సవాలు అజరామరం

కోణార్క్‌ ఉత్సవాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, రాష్ట్ర పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్విని పాత్ర్‌ చెప్పారు.

Published : 04 Dec 2022 02:19 IST

పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు

ప్లాస్టిక్‌ వ్యర్థాలు వద్దన్న సందేశంతో సైకత శిల్పిం

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: కోణార్క్‌ ఉత్సవాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, రాష్ట్ర పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్విని పాత్ర్‌ చెప్పారు. శనివారం సహచర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషార కాంతి బెహరతో కలిసి కోణార్క్‌ చేరువలోని చంద్రభాగ తీరాన్ని ఆయన సందర్శించారు. 29 మంది శిల్పులు ఇక్కడ తీర్చిదిద్దుతున్న సందేశాత్మక సైకత శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్ర్‌ మాట్లాడుతూ.. పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రముఖ కేంద్రాల్లో ఏటా వేడుకలు చేపడుతోందన్నారు. ఈ నెల 24 నుంచి గోపాలపూర్‌ తీర సంబరాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కొత్త పర్యటక విధానం ఆమోదం పొందినందున రాష్ట్రంలో వెనుకబడిన చారిత్రక పీఠాలన్నీ వైభవం సంతరించుకుంటాయని తెలిపారు. క్రీడలశాఖ మంత్రి బెహర మాట్లాడుతూ... కోణార్క్‌ వేడుకల్లో సైకత శిల్ప ప్రదర్శన రాష్ట్ర ఖ్యాతికి అద్దం పడుతోందన్నారు.

సమ్మోహనం శాస్త్రీయ నృత్యాలు

సమ్మోహనం చేస్తున్న శాస్త్రీయ నృత్యాలు

కోణార్క్‌ సాంస్కృతి వేదికపై రాత్రి వరకు ఏర్పాటవుతున్న శాస్త్రీయ నృత్యాలు సందర్శకులను సమ్మోహనం చేస్తున్నాయి. శనివారం రాత్రి చెన్నైకి చెందిన దృశ్యం సెంటర్‌ ఫర్‌ మోహినీ అట్టం సంస్థ కళాకారుల నాట్యాలు, మయూర్‌లలిత్‌ డాన్స్‌ అకాడమీ (కోల్‌కతా)వారి ఒడిస్సీ నృత్యాలు నేత్రపర్వం చేశాయి. కొవిడ్‌ వల్ల గతేడాది కోణార్క్‌ సంబరాలు తిలకించడానికి పర్యటకులు పెద్దగా రాలేదు. ఈ ఏడాది ఎక్కువగా వస్తున్నారు. విదేశాల నుంచి ఎంతోమంది అతిథులొచ్చారు. పగలు సైకత శిల్పాల ప్రదర్శన, రాత్రిళ్లు కళాకారుల నాట్యాలు రంజింపజేస్తున్నాయి.  


మళ్లీ శ్రీక్షేత్రం దృశ్యాలు వైరల్‌

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రం దృశ్యాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. డ్రోన్‌ కెమేరాతో ఆలయంపైన, చుట్టుపక్కలా చిత్రీకరించిన 5.43 నిమిషాల నిడివి గల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. కృష్ణ చంద్రపాఢి అనే వ్యక్తి ఖాతాతో ఈ దృశ్యాలున్నాయి. దీనిపై శ్రీక్షేత్ర సేవాయత్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఏర్పాటయ్యే పాలకవర్గం సమావేశంలో ఇదే అంశం కీలకమవుతుందని పాలకవర్గం ప్రతినిధి మాధవ చంద్రదాస్‌ విలేకరులకు చెప్పారు. ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన ఆకాష్‌ చౌధురి అనే వ్యక్తి గర్భగుడి దృశ్యాలు వైరల్‌ చేసిన సంఘటనలో అరెస్టయ్యారు. ఇంతలో మళ్లీ డ్రోన్‌ కెమేరా దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.దీనిపై భక్తులోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు