logo

అధ్వానంగా ఘన వ్యర్థాల నిర్వహణ: కాగ్‌

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలు అధ్వానంగా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. ఘన వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి డంపింగ్‌ చేయడం నుంచి యూజర్‌ ఫీజు వసూళ్ల వరకు అసంతృప్తికరంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది.

Published : 06 Dec 2022 03:24 IST

రాయగడలో ప్రాసెసింగ్‌ చేయకుండానే డంపింగ్‌ చేసిన వ్యర్థాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలు అధ్వానంగా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. ఘన వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి డంపింగ్‌ చేయడం నుంచి యూజర్‌ ఫీజు వసూళ్ల వరకు అసంతృప్తికరంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. ‘‘పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ’’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో కాగ్‌ ఈ విషయాలు వెల్లడించింది. వాటి ప్రకారం.. పట్టణ, నగర ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు పట్టణ స్థానిక సంస్థలు కానీ సరైన చర్యలు చేపట్టలేదు. దాంతో 2021 మార్చి వరకు 90 శాతం వ్యర్థాలను ఎలాంటి రీసైక్లింగ్‌ చేయకుండానే డంపింగ్‌ చేయడం గమనార్హం. 2016 ఏప్రిల్‌ 8న ప్రకటించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2016 ప్రకారం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడాదిలోగా రాష్ట్రం దీనిపై పాలసీ సిద్ధం చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఘన వ్యర్థాల నిర్వహణపై సమగ్ర పాలసీని జారీ చేయకపోవడాన్ని కాగ్‌ తప్పు పట్టింది.

వేల టన్నుల వ్యర్థాలు...

2015-20 మధ్య స్మార్ట్‌ సిటీల్లో రోజుకి 2,956 టన్నుల వ్యర్థాలను, ఏడాది 35,057 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎలాంటి ప్రాసెసింగ్‌ చేయకుండానే డంపింగ్‌ చేసినట్లు కాగ్‌ వెల్లడించింది. పట్టణాల్లో ఇంటింటికీ చెత్త తొట్టెలు సమకూర్చడం, ఘన వ్యర్థాల సేకరణ, వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు రోజు చేపట్టడం తదితర అంశాల్లో యూఎల్‌బీ(అర్బన్‌ లెవెల్‌ బాడీ)లు వంద శాతం విఫలమైనట్లు కాగ్‌ నివేదికలో పేర్కొంది. 21 యూఎల్‌బీలో పరిశీలించగా కేవలం ఏడు యూఎల్‌బీలు మాత్రమే యూజర్‌ ఫీజులు వసూలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2017-21ల మధ్య ఈ ఫీజు రూపంలో రూ.161.41 కోట్ల ఆదాయం సమకూరనుండగా కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలైనట్లు కాగ్‌ బహిర్గతం చేసింది.

పారిశుద్ధ్య చర్యలు లోపంతో ముర్జా కాలువలో పేరుకుంటున్న చెత్తాచెదారాలు

దక్కని రూ.333 కోట్ల కేంద్ర సాయం...

2015-20 మధ్య రోజుకు 2956 టన్నుల ఘన వ్యర్థాలు, ఏడాదికి 35,057 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రాసెసింగ్‌ చేయకుండానే డంపింగ్‌ చేయడంతో రూ.333.58 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం దక్కించుకోవడంలో యూఎల్‌బీలు విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం కారణంగా సొంత ఆదాయ వనరులు, ఘన వ్యర్థాల నిర్వహణ ఖర్చు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయిందని కాగ్‌ పేర్కొంది. 2015-16లో ఈ వ్యత్యాసం రూ.81.33 కోట్లు కాగా 2019-20 నాటికి అది రూ.168.73 కోట్లకు పెరిగినట్లు కాగ్‌ బహిర్గతం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని