logo

పద్మపూర్‌లో ప్రశాంతంగా పోలింగ్‌

బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ అసెంబ్లీ స్థానానికి సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కలెక్టరు మనీషా బెనర్జీ విలేకరులకు తెలిపారు.

Published : 06 Dec 2022 03:24 IST

8న ఫలితం వెల్లడి: ఎస్‌ఈసీ సుశీల్‌ కుమార్‌

పైకమాల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిల్చొన్న ఓటర్లు

భువనేశ్వర్‌, బరగఢ్‌, న్యూస్‌టుడే: బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ అసెంబ్లీ స్థానానికి సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కలెక్టరు మనీషా బెనర్జీ విలేకరులకు తెలిపారు.

సమయం ముగిసినా.. అవకాశం

ఉదయం 7 నుంచి 4 వరకు 319 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగగా.. ఆయాచోట్ల 9 గంటలకు 8.5 శాతం పోలింగ్‌ నమోదైంది. 11 గంటలకు 29.73, ఒంటి గంటకు 46.96, 3 గంటలకు 65.28 శాతం పోలింగ్‌ జరిగింది. సమయం ముగిసినా కేంద్రాల్లో ఓటర్లు ఉండడంతో యంత్రాంగం వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది.

విజయంపై ధీమా

బిజద అభ్యర్థి బర్షా సింగ్‌ బరిహ, భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యభూషణ్‌ సాహులు తమ ప్రాంతాల్లో కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగ్గురు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిక అయిన తరువాత ఈవీఎంలను పద్మపూర్‌లోని ఆర్‌ఎంసీ కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జరగనుంది.

ధన్యవాదాలు తెలిపిన ఎస్‌ఈసీ..

సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌కుమార్‌ లోహాని భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పద్మపూర్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని, సహకరించిన సిబ్బంది, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ 4 వరకే అయినా 89 కేంద్రాల్లో 12 వేల పైచిలుకు ఓటర్లు వేచి ఉన్నందున వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించామన్నారు. 2019లో పద్మపూర్‌లో 79.5శాతం పోలింగ్‌ జరిగిందని, ప్రస్తుత ఉప ఎన్నికలో ఈ సంఖ్యకు చేరువగా ఉంటుందన్న అంచనా ఉందని చెప్పారు.

ఓటేసి వస్తున్న దివ్యాంగ ఓటరు


ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పద్మపూర్‌ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఏర్పాటైన ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగింది. చివరి సమాచారం మేరకు ఆరు గంటలకు 80.5 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌కుమార్‌ లోహానీ సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. ఓటర్లు ఉత్సాహంగా తమ హక్కు వినియోగించుకున్నారన్నారు. ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ బిజద ఎమ్మెల్యే బిజయ్‌రంజన్‌ సింగ్‌ బరిహా మృతితో ఉప ఎన్నిక నిర్వహించారు. ఆయన కుమార్తె బర్షారాణి సింగ్‌ బరిహను ముఖ్యమంత్రి ఈ స్థానానికి నిలబెట్టారు. భాజపా తరఫున మాజీ ఎమ్మెల్యే ప్రదీప్‌ పురోహిత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సత్యభూషణ్‌ సాహు రంగంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని