logo

నేర వార్తలు

రామన్నగుడ సమితి భామిని గ్రామానికి చెందిన రాధాకృష్ణ బెహరా కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ బెహరా శనివారం వంశధార నదికి స్నానానికి వెళ్లి మునిగిపోయాడు.

Published : 06 Dec 2022 03:24 IST

బాలుడి మృతదేహం లభ్యం

గుణుపురం, నూస్‌టుడే: రామన్నగుడ సమితి భామిని గ్రామానికి చెందిన రాధాకృష్ణ బెహరా కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ బెహరా శనివారం వంశధార నదికి స్నానానికి వెళ్లి మునిగిపోయాడు. తోటి స్నేహితులు గుమడా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపులు జరిపారు. ఆదివారం గుణుపురం ఓడ్రాఫ్‌ బృందం అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు. సోమవారం ఉదయం భామిని ఐఆర్‌బీఎన్‌ క్యాంప్‌ సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. అధికారులు అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు.


ప్రమాదంలో ఒకరి మృతి

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లా పొడియ సమితి తెలాంగుడ గ్రామం సమీపంలోని ద్విచక్రవాహనం అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం మల్కాన్‌గిరి జిల్లా పొడియా సమితి చిత్రాంగపల్లి పంచాయతీ ఉస్కాపల్లి గ్రామానికి చెందిన కోస పడిమామి, నందా కవాసి రాత్రి మాటేరు గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా తెలాంగుడ వద్ద వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నందా కవాసి (38) గాయాలై మృతి చెందగా కోసా పడియామి స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


ఇంటికి వెళుతూ.. అనంత లోకాలకు

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కాశీపూర్‌ హనుమాన్‌ మందిర కూడలి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సొరుగుంజి గ్రామనికి చెందిన నిరంజన్‌ నాయక్‌(23)అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి ఇంటి నుంచి వస్తుండగా హనుమాన్‌ మందిర కూడలి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో తలకు తీవ్రంగా గాయమై ఘటన స్థలం వద్ద మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


2,572 కిలోల గంజాయికి నిప్పు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: జిల్లాలో ఇటీవల కాలంలో 5 చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా రవాణా అవుతున్న 2,572 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొరాపుట్‌ జిల్లా పోలీస్‌, అబ్కారీ సిబ్బంది వెల్లడించారు. ఆ సరకును సోమవారం దమన్‌జోడిలోని ఒక నిషేధిత ప్రాంతంలో దహనం చేశారు. కొరాపుట్‌ ఎస్పీ వరుణ్‌ గుంటుపల్లి నేతృత్వంలో డీఎస్పీ తపన్‌కుమార్‌ మహా నందియా, సునాబెడ ఎస్‌డీపీఓ మనోజ్‌కుమార్‌ బెహరాలు పాల్గొన్నారు.


పక్షుల కళేబరాలు స్వాధీనం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఖుర్దా జిల్లా చిలికా వన్యప్రాణి డివిజన్‌ పరిధిలో టాంగీ రేంజ్‌లోని కళుపడ ముఖద్వారం వద్ద గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది సోమవారం చైతన్య ప్రధాన్‌(46) అనే వ్యక్తి నుంచి అయిదు పక్షి కళేబరాలు, ఓ నాటు పడవ స్వాధీనం చేసుకున్నారు. నిందితునిది టాంగీ ఠాణా పరిధిలోని జటియాపట్న గ్రామం. ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచామని టాంగీ రేంజర్‌ చూడారాణి ముర్ము మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి నుంచి లార్జ్‌ విజలింగ్‌ డక్‌ జాతికి చెందిన రెండు పక్షుల కళేబరాలు, పర్పుల్‌ మోర్హెన్‌, కామన్‌ మోర్హెన్‌, ఫీజంట్‌ టెయిల్డ్‌ జకానా జాతులకు చెందిన మూడు పక్షుల కళేబరాలు స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు.


అదుపు తప్పిన ప్రైవేటు బస్సు

కటక్‌, న్యూస్‌టుడే: కేంఝర్‌ జిల్లా కంజిపాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమార్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం ఒక ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కామాఖ్యనగర్‌ నుంచి కేంఝర్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పైనుంచి కిందకు పడింది. అతివేగంతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.


బ్యాంకు మేనేజర్‌ బలవన్మరణం

కటక్‌, న్యూస్‌టుడే: ఓ బ్లాక్‌మెయిలింగ్‌ ముఠా ఒత్తిడి బ్యాంకు మేనేజర్‌ ప్రాణం తీసింది. సోమవారం సోన్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ అమరేష్‌ పండా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టులో బరపల్లిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అగ్రికల్చర్‌ విభాగం చూసే మేనేజర్‌గా పనిచేసిన దివ్య రంజన్‌ మిశ్ర ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌కి చెందిన బ్లాక్‌ మెయిలింగ్‌ ముఠా వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆయన ఓ యువతితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను సేకరించిన ముఠా మేనేజర్‌కి చూపించి రూ.26 లక్షలు వసూలు చేశారు. మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.


పెళ్లి బస్సు బోల్తా: పది మందికి గాయాలు

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్‌లో రూప్‌ నారాయణపూర్‌ 6వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెళ్లి బస్సు బోల్తా కొట్టింది. పది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గుర్ని మిడ్నాపూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా సూతాహాటీకి చెందిన 40 మంది ఝార్‌గ్రామ్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు