logo

మలేరియా నియంత్రణలో మరో మైలరాయి

రాష్ట్రంలో మలేరియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే పలు ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న ఒడిశా సర్కార్‌ మరో మైలురాయిని అందుకుంది.

Published : 21 Jan 2023 05:39 IST

రాష్ట్రానికి దక్కిన స్కోచ్‌ అవార్డు

రాష్ట్రానికి దక్కిన స్కోచ్‌ అవార్డు ప్రశంసాపత్రం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మలేరియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే పలు ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న ఒడిశా సర్కార్‌ మరో మైలురాయిని అందుకుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో దోమతెరల పంపిణీ, వాటి వినియోగంపై అవగాహన కల్పన కేటగిరిలో స్కోచ్‌ అవార్డు దక్కించుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా నిర్వహించిన ఆయుష్మాన్‌ భారత్‌ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఈ అవార్డుని ప్రదానం చేశారు. రాష్ట్రం తరఫున ప్రజారోగ్యశాఖ సంచాలకుడు నిరంజన్‌ మిశ్ర, ఆరోగ్యసేవల సంయుక్త సంచాలకులు శుభాషిత మహంతి పాల్గొని అవార్డు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో మలేరియా నియంత్రణకు తీసుకున్న చర్యలకు గాను దీనిని ప్రదానం చేశారు. 2020లో కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి స్వీకరించిన దోమతెరలను నిల్వ చేయడం నుంచి వాటి రవాణా, ప్రభావిత జిల్లాల్లో పంపిణీ వరకు రాష్ట్ర సర్కార్‌ అమలు చేసిన ప్రణాళిక బాగుందని ఈ సందర్భంగా కొనియాడారు.

అయిదేళ్లలో 95 శాతం తగ్గుముఖం

2017లో దోమతెరల పంపిణీ నుంచి మలేరియా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ అయిదేళ్లలో 95శాతం వరకు కేసులు తగ్గినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 2017లో 4.44 లక్షలుగా నమోదైన మలేరియా కేసుల సంఖ్య 2022 నాటికి 23,770కి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గావ్‌ కళ్యాణ్‌ సమితి (జీకేఎస్‌), ఆశాకార్యకర్తల ప్రమేయంతో దోమతెరల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించడం వల్ల ఇది సాధ్యపడిందని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పంపిణీతోపాటు వాటి వాడకం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ మైలురాయిని చేరుకోవడంలో దోహదపడిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అవగాహన లేమితో కొందరు దోమతెరలను చేపలు పట్టేందుకు, మొక్కలకు రక్షణ వలయాలకు తదితర వాటికి వినియోగిస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. వాటిపై దృష్టి పెడితే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు.

దోమతెర వినియోగంపై అవగాహనకు ఓ ఇంటి గోడకు అంటించిన పత్రిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని