logo

సువర్ణరేఖ నదిపై వంతెన

బాలేశ్వర్‌ జిల్లా జలేశ్వర్‌ వద్ద సువర్ణరేఖ నదిపై వంతెన నిర్మాణమవుతుంది. రూ.101 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది

Published : 22 Jan 2023 02:45 IST

మూడు జిల్లాలకు మంచినీటి ప్రాజెక్టులు
గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ అధ్యాపకులకు వరాలు
నవీన్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

జలేశ్వర్‌ (బాలేశ్వర్‌) వద్ద సువర్ణరేఖ నది​​​​​​

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లా జలేశ్వర్‌ వద్ద సువర్ణరేఖ నదిపై వంతెన నిర్మాణమవుతుంది. రూ.101 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పనులు పూర్తవుతాయి. శనివారం మధ్యాహ్నం లోక్‌సేవా భవన్‌ వేదికగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను అభివృద్ధి కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ జెనా విలేకరులకు తెలియజేశారు.

క్యాన్సర్‌ రోగుల వసతికి

భువనేశ్వర్‌లో బగ్చీ, శంకర్‌ క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆవరణలో రోగుల వసతి కోసం విశాలమైన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలం ఉచితంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎస్‌ఈబీసీలోకి ఓబీసీ కులాలు

వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో లేని 22 కులాల వారికి సామాజిక, ఆర్ధిక రంగాల్లో వెనుకబడిన క్యాటగిరి (ఎస్‌ఈబీసీ)లో చేరుస్తారు. దీనికి సంబంధించి ఓబీసీ చట్టంలో స్వల్ప సవరణలు చేయడానికి నిర్ణయించారు. జ్యుడీషియరీకి సంబంధించి ఓఎస్‌జే, ఓఎస్‌జేఎస్‌ విధానంలో స్వల్పంగా మార్పులు జరిగాయి. జీఎస్‌టీ, వాణిజ్య పన్నుల విభాగంలో డాటా ఎంట్రీ పోస్టుల భర్తీ చట్టంలో స్వల్ప సవరణలు చేస్తారు. ప్రభుత్వ శాఖల్లో గ్రూపు ‘బి’ పోస్టుల భర్తీలు, గనుల శాఖలో మరింత పారదర్శకత ధ్యేయంగా చట్టంలో సవరణలు చేసినట్టు చెప్పారు. క్యాబినెట్‌ సమావేశంలో 12 అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు.  

మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం

వేసవిలో ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. వసుధ, జల్‌ జీవన్‌, సుజల పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మల్కాన్‌గిరి జిల్లాలోని మథిలి, ఖయిరాపుట్‌, కలిమెల, మల్కాన్‌గిరి సమితుల్లో నాలుగు మంచినీటి సరఫరా ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతాయని జెనా చెప్పారు. నయాగఢ్‌ జిల్లాలోని దసపల్లా, నువగాం, గొణియా సమితుల్లో, జాజ్‌పూర్‌ జిల్లా కొరై, బొరి సమితుల్లోనూ మంచినీటి సరఫరా పథకాల పనులు పూర్తవుతాయని తెలిపారు.

అధ్యాపకుల డిమాండు నెరవేరింది

రాష్ట్రంలోని గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పూర్తిస్థాయి వేతనాల కోసం ఎంతోకాలంగా ఉద్యమిస్తున్నారు. కొత్త సంవత్సర కానుకగా వారి డిమాండుకు ప్రభుత్వం ఆమోదించిందని, పెరిగిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయని, ప్రభుత్వంపై ఏడాదిలో రూ.290 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రదీప్‌ కుమార్‌ జెనా తెలిపారు.
 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని