logo

అక్రమాలు నిజం... రాష్ట్రం పంపిన దస్త్రాలే ఆధారం

గనులశాఖలో అవినీతి జరిగిందని, ఇందుకు ఆధారాలున్నాయన్న తమ ఆరోపణలను గతంలో కొట్టి పారేసిన పాలకులు తర్వాత అవినీతి జరిగిందని కేంద్రానికి ఎలా లిఖితపూర్వకంగా తెలియజేశారని భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి ప్రశ్నించారు.

Published : 25 Jan 2023 02:29 IST

భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

అపరాజిత షడంగి

గనులశాఖలో అవినీతి జరిగిందని, ఇందుకు ఆధారాలున్నాయన్న తమ ఆరోపణలను గతంలో కొట్టి పారేసిన పాలకులు తర్వాత అవినీతి జరిగిందని కేంద్రానికి ఎలా లిఖితపూర్వకంగా తెలియజేశారని భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి ప్రశ్నించారు. మంగళవారం ఆమె భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనకు కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద జోషి రాసిన లేఖ ప్రతులు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో అక్రమాలు జరిగాయని అంగీకరించిన విషయాన్ని అంగీకరించిన విషయాన్ని వివరించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ... 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఈ-వేలం ద్వారా గనులు కేటాయించారని, హైగ్రేడ్‌ ఖనిజాలు ఉన్నవాటిని లో గ్రేడ్‌గా ప్రకటించి తక్కువ ధరకు అప్పగించారని ఆరోపించారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఖజానాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. దీనివల్ల గనులున్న జిల్లాలకు అభివృద్ధి నిధులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము పార్లమెంటులో ప్రస్తావించిన తర్వాత కేంద్రం రాష్ట్రానికి వివరణ అడగడంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. అవినీతి జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించి కేంద్రానికి తెలియపరిచిందన్నారు. ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం) నిబంధనలకు రాష్ట్రంలో తూట్లు పడ్డాయన్న అపరాజిత పాలకులు దీనికి జవాబుదారీ అన్నారు.

కేంఝర్‌ జిల్లాలో గనులు

అక్రమాలు పునరావృతం కారాదు

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుండగా, మళ్లీ అనర్హులకు స్థానం కల్పిస్తున్నారని, ఇది వరకు జరిగిన తప్పిదాలు పునరావృతమవుతున్నాయని అపరాజిత చెప్పారు. బిజద పాలకులు స్వీయ ప్రచారానికి ఈ పథకాన్ని వినియోగించుకోకుండా పేద కుటుంబాలను జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా భాజపా విడిచిపెట్టదని, గట్టి నిఘా ఉందని, మళ్లీ బిజద కార్యకర్తలకు జాబితాలో చేర్చకుండా ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని