logo

మెరిసిన పద్మాలు

వివిధ రంగాల్లో నిష్ణాతులైన రాష్ట్రానికి చెందిన నలుగురికి కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.

Updated : 27 Jan 2023 06:08 IST

నవీన్‌, ధర్మేంద్రల హర్షం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: వివిధ రంగాల్లో నిష్ణాతులైన రాష్ట్రానికి చెందిన నలుగురికి కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఒడిశా గౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వీరికి సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.


పండిత అంతర్యామి మిశ్ర

ఢెంకనాల్‌ జిల్లా కామాక్ష్యనగర్‌ సమితి మార్థాపూర్‌ శాసనాం గ్రామానికి చెందిన పండిత అంతర్యామి మిశ్ర సాహితీ రంగానికి ఎనలేని సేవలందిస్తున్నారు. 30 పుస్తకాలు రచించారు. ఈయన రాసిన 9 పుస్తకాలు పలువురి మన్ననలు అందుకున్నాయి. ఈయన రాసిన ‘పుణ్యపీఠ్‌ కపిలాస్‌’ అన్న పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా ఉన్న ఆయన నిరంతర పరిశోధకునిగా ఇంతవరకు రచనలు సాగిస్తున్నారు. ఉత్తర ఒడిశా విశ్వవిద్యాలయం (బాలేశ్వర్‌) అంతర్యామికి డీలిట్‌ డిగ్రీ అందజేసింది. సాహితీ రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అంతర్యామి మిశ్ర తండ్రి దివంగత సత్యబాది మిశ్ర స్వాతంత్య్ర సమరయోధుడు.


బొమ్మలాట మగుని

కేంఝర్‌ జిల్లా కేంద్రం పరిధిలోని వైద్యరాజ వీధికి చెందిన మగుని కుమార్‌ బొమ్మలాట నృత్య గురువు. 14 ఏళ్ల వయసు నుంచి ఈ కళకే అంకితమైన ఆయన రావణ వధ, త్రిపురాసుర వధ, చంద్రహాసం, మండోదరి వివాహం, సతీ తులసి, వీరాభిమన్యు తదితర పౌరాణిక ఇతివృత్తాలతో కూడిన బొమ్మలాటలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ అనేక ప్రదర్శనలిచ్చారు. ఈ కళను నమ్ముకున్న మగుని ఒక దశలో బతుకు తెరువు కోసం భార్య నగలు, తన ద్విచక్ర వాహనం విక్రయించుకున్నారు. 2004లో కేంద్ర సంగీత, నాటక అకాడమీ ఆయనను సత్కరించింది. బొమ్మలే తన సర్వస్వం చేసుకున్న మగునికి ఎన్నో సంస్థలు గతంలో అవార్డులు, రివార్డులు అందజేశాయి. ఇప్పుడాయనకు కేంద్రం ‘పద్మ’ పురస్కారంతో సత్కరించింది.


‘రొంగొబొతి’ కృష్ణ

గత మూడు దశాబ్దాల క్రితం ‘రొంగొబొతి’ సంబల్‌పూర్‌ జానపద గీతం ప్రపంచవ్యాప్తంగా శ్రోతల్ని అలరించింది. ఇంతవరకిది ఆదరణ పొందుతోంది. ఈ గీతాన్ని ఆలపించిన కృష్ణ పటేల్‌ సంబల్‌పూర్‌ జిల్లా కుచిండ గ్రామ మహిళ. రొంగొబొతి పాటతో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆమె తర్వాత ఎన్నో హిట్‌ జానపద ఆల్బంలు అందించారు. మరో ప్రముఖ గాయకుడు జితేంద్ర హరిపాల్‌తో కలసి ఆలపించిన గీతాలు యువకులతో చిందులేయించాయి. ఆమెకు రాష్ట్ర సంస్కృతి విశ్వవిద్యాలయం (భువనేశ్వర్‌) ఇటీవల గౌరవ ‘డాక్టరేట్‌’ డిగ్రీతో సత్కరించింది. మరోవైపు బుధవారం ఆమెకు ‘పద్మశ్రీ’ వరించింది.


వృక్ష బంధు పటాయత్‌

కలహండి జిల్లా జునాగఢ్‌ సమితి నందోల్‌ గ్రామానికి చెందిన పటాయత్‌ సాహు వృక్ష ప్రేమికుడు. ఒకటిన్నర ఎకరాల స్థలంలో 3 వేల ఔషధీయ మొక్కలు నాటి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ప్రధానమంత్రి తన ‘మన్‌కీ బాత్‌’ (మనసులో మాట) ఆకాశవాణి కార్యక్రమంలో హరిత విప్లవం ధ్యేయంగా పటాయత్‌ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆయుర్వేదంలో దిట్ట అయిన సాహు ఔషధీయ మొక్కలు, లతలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ సేవకే అంకితమైన ఆయన తన పొలంలో చెట్లు, లతలు పెంచుతున్నారు. ఈ వృక్ష ప్రేమికునికి ‘పద్మశ్రీ’ వరించింది.

విజేతల కృతజ్ఞతలు : ఈ నలుగురు ‘పద్మశ్రీ’ విజేతలు ఆయాచోట్ల గురువారం విలేకరులతో మాట్లాడుతూ... తమకు లభించిన గౌరవం కళామతల్లికి అంకితమని, చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవార్డులు రావడానికి కారణమైన ప్రజలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు