logo

సంస్కృతికి అద్దం పడుతున్న ఒడియా సాహిత్యం

సమాజ దర్శనానికి, దురాచారాల నిర్మూలన, పరివర్తన లక్ష్యంగా చేసుకుని ఎంతోమంది ఒడియా రచయితలు, సాహితీవేత్తలు, కవులు కలాలకు పదును పెట్టారని ప్రముఖ తెలుగు రచయిత్రి డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి (బ్రహ్మపుర) చెప్పారు.

Published : 28 Jan 2023 02:04 IST

ఆదరణ పొందుతున్న అనువాదాలు
‘న్యూస్‌టుడే’తో రచయిత్రి తుర్లపాటి
గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే

సమాజ దర్శనానికి, దురాచారాల నిర్మూలన, పరివర్తన లక్ష్యంగా చేసుకుని ఎంతోమంది ఒడియా రచయితలు, సాహితీవేత్తలు, కవులు కలాలకు పదును పెట్టారని ప్రముఖ తెలుగు రచయిత్రి డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి (బ్రహ్మపుర) చెప్పారు. ఒడియా నుంచి తెలుగులోకి అత్యుత్తమ పుస్తకాలు అనువదించిన ఆమె ఇటీవల గోపాల్‌పూర్‌లో ఏర్పాటైన తన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రోద్బలంతో

‘జ్ఞాన్‌పీఠ్‌’ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ ప్రతిభారాయ్‌, గోపీనాథ్‌ మహంతిల ఒడియా రచనల్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రోద్బలంతో తాను తెలుగులోకి అనువదించినట్లు తుర్లపాటి చెప్పారు. వర్తమాన సమాజంలో దురాచారాలను ఖండిస్తూ, మానవ స్వభావ చిత్రణ దిశగా ప్రతిభారాయ్‌ తన కలానికి పదును పెట్టారన్నారు. ఒడియా సంస్కృతి, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సమాజదర్శనం ఆమె కథల్లో ఉంటుందని తెలిపారు. ప్రతిభా రచించిన 21 కథలను తాను ‘ఉల్లంఘన’ పేరిట తెలుగులోకి అనువదించినట్లు చెప్పారు.

ఆదీవాసీల జీవన ప్రమాణాలకు అద్దం

గోపీనాథ్‌ మహంతి ఆదివాసీల జీవన ప్రమాణాలు, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలపై స్వయంగా అధ్యయనం చేసి రచనలు చేశారని తుర్లపాటి చెప్పారు. సాహిత్య అకాడమీ ప్రోత్సాహంతో ఆయన రచించిన కథల సంపుటి ధాది బుఢాని తాను ‘ఈతచెట్టు దేవుడు’ పేరిట తెలుగులోకి అనువాదం చేసినట్లు చెప్పారు.

ఈతచెట్టు దేవుడు

మన్నలందుకున్న రచనలు

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ఆంగ్ల కథల సంపుటి ‘ఫ్రూట్‌ గేదరింగ్‌’ తెలుగులో నివేదన పేరిట అనువదించినట్లు తుర్లపాటి చెప్పారు. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ విన్నపం మేరకు ఒడియా రచయిత మహేంద్రకుమార్‌ మిశ్ర రచించిన కథల సంపుటి ‘ఒడియా జానపద కథలు’ పేరిట అనువదించిన పుస్తకం ఈవారంలో విడుదల కానుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత లెబనాన్‌ కవి, తత్వవేత్త, దార్శనికుడు ఖలీల్‌ జిబ్రాన్‌ ఆంగ్లంలో రచించిన ‘ది ప్రాఫిట్‌’ పుస్తకాన్ని ‘ప్రవక్త’ పేరిట తెలుగులో అనువదించానని, ‘జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం, భ్రమలు, సందేహాల నుంచి విముక్తి’ దీని సారాంశమని చెప్పారు. తాను ఇంతవరకు 22 పుస్తకాలు రచించానని, అన్నీ పాఠకాదరణ పొందినట్లు తెలిపారు. ఒడిశా సాహిత్య అకాడమీ సూచనల మేరకు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల రచన ప్రారంభించానని, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ మరికొన్ని ప్రతిపాదనలు పంపించిందని, ఇతర రచనలు ప్రారంభిస్తున్నట్లు తుర్లపాటి చెప్పారు.


సత్కారాలు, ప్రశంసలతో...

చయిత్రిగా, సాహితీవేత్తగా, సద్విమర్శకురాలిగా కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, ఇతర సంస్థల ద్వారా సత్కారాలు, ప్రశంసలు అందుకున్న తాను ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడే రచనలు ధ్యేయంగా పెట్టుకున్నట్లు తుర్లపాటి చెప్పారు. చతుర, విపుల ఇతర మాస, పక్ష, వార పత్రికల్లో ప్రచురితమైన తన కథలు పాఠకాదరణ పొందాయని, సమీప భవిష్యత్తులో పాఠక దేవుళ్లకు మరికొన్ని మంచి పుస్తకాలు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని తుర్లపాటి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని