logo

ఉపాధి హామీలో గంజాం జిల్లాదే అగ్రస్థానం

దేశవ్యాప్తంగా అత్యధిక ఉపాధి హామీ పనులు కల్పించిన జిల్లాగా గంజాం అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి పనుల పరంగా జాతీయ స్థాయిలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన జాబితాలో మన రాష్ట్రం నుంచి మరో రెండు జిల్లాలకు చోటు దక్కింది.

Updated : 28 Jan 2023 05:36 IST

జాతీయస్థాయి తొలి ఐదుస్థానాల్లో మరో రెండు జిల్లాలకు చోటు

ఉపాధి పనుల్లో మహిళలకే ఎక్కువ అవకాశం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా అత్యధిక ఉపాధి హామీ పనులు కల్పించిన జిల్లాగా గంజాం అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి పనుల పరంగా జాతీయ స్థాయిలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన జాబితాలో మన రాష్ట్రం నుంచి మరో రెండు జిల్లాలకు చోటు దక్కింది. గంజాం జిల్లా పరిషత్తు ముఖ్య అభివృద్ధి అధికారి వి.కీర్తి వాసన్‌ దీనిపై స్పందిస్తూ దేశంలోనే గంజాం అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 2.26 కోట్ల పనిదినాలను కల్పించడం ద్వారా జిల్లాకు ఈ కీర్తి లభించిందన్నారు. 2022-23 ఏడాదికి గాను జిల్లాలో 63,449 కుటుంబాలకు 100 రోజుల ఉపాధి సమకూర్చినట్లు ఆయన వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 3.54 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కీర్తి వాసన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితుల తరువాత లేబర్‌ ఇంటెన్సివ్‌ స్కీం కింద గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధికి కల్పించిన వివిధ పనులు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికులు మళ్లీ వలసలకు పోకుండా వారి సొంత ఊళ్లలోనే ఉపాధి పొందేందుకు ఇది బాగా సహకరించిందన్నారు. రహదారులు, మరుగునీటి కాలువల నిర్మాణంతోపాటు గ్రామీణ ఉద్యానవనాలు, గ్రామీణ పర్యటక కేంద్రాలు, ఆధునిక హెచరీలు, గ్రంథాలయ సమాచార కేంద్రాలు వ్యాయామశాలలు, ఆధునిక చెరువుల నిర్మాణం తదితర ప్రాజెక్టులను ఈ పథకం కింద చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.


మరో రెండు జిల్లాలకు చోటు

త్యధిక కుటుంబాలకు వంద రోజుల ఉపాధి కల్పించిన జాబితాలో మన రాష్ట్రం నుంచి కొంధమాల్‌, బొలంగీర్‌ జిల్లాలు రెండు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. 35,141 కుటుంబాలకు వంద రోజుల ఉపాధి కల్పనతో కొంధమాల్‌ రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్‌లోని బర్మేర్‌ (34,994 కుటుంబాలు), బొలంగీర్‌ (26,209) తరువాత స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక పనిదినాల కల్పన జాబితాలో గంజాం తరువాత బర్మేర్‌ (2.18 కోట్లు), తమిళనాడులోని తిరువణమలై (2.13 కోట్లు) నిలిచాయి. ఉపాధి పనుల్లో అత్యధికంగా 58శాతం మహిళలకు అవకాశం కల్పించి రాష్ట్రంలో గంజాం జిల్లా అగ్రస్థానంలో నిలవడం మరో మైలురాయి. గతంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1,29,290 కుటుంబాలకు 100 రోజుల ఉపాధి కల్పించి గంజాం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని