logo

బ్రహ్మపురలో కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

‘ఒడిశా సంకల్పం.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం’ నినాదంతో రాష్ట్రంలో చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ శనివారం బ్రహ్మపురలో సాగింది.

Published : 29 Jan 2023 01:40 IST

పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘ఒడిశా సంకల్పం.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం’ నినాదంతో రాష్ట్రంలో చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ శనివారం బ్రహ్మపురలో సాగింది. ఉదయం అస్కా రోడ్డు మొదటి గేటు నుంచి మొదలైన యాత్ర మధ్యాహ్నం నగర శివారున అంబపువా వద్ద ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించి, ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షల జమ, 2 కోట్ల ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధరల నియంత్రణ ఊసేలేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 ఏళ్లపాటు బిజద అధికారంలో ఉందని, ఒడిశా మరింత పేద రాష్ట్రంగా మారిందన్నారు. లక్షలాది మంది యువత ఉపాధి కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలసపోతున్నారని, వారి భవిత నాశనమైందని పట్నాయక్‌ దుయ్యబట్టారు. పాదయాత్రలో కాంగ్రెస్‌ నాయకులు బందితా పరిడా, మాజీ మంత్రి జుధిష్ఠర జెనా, హలధర కార్జి, రశ్మిరంజన్‌ పట్నాయక్‌, త్రినాథ బెహర, పీతబాస పండా, బనజా పండా, సనాతన్‌ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుర సమీప ప్రాంతాల్లో జరిగిన పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు, సన్నొఖెముండి ఎమ్మెల్యే రమేష్‌చంద్ర జెనా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని