logo

అడవిలో వివాహిత హత్య

నువాపడ జిల్లా లఖన ఠాణా పరిధిలోని కర్లాబహాలి అటవీ ప్రాంతంలో శనివారం ఓ మహిళ మృతదేహం వెలుగు చూసింది.

Published : 29 Jan 2023 01:40 IST

ఘటనాస్థలంలో మహిళ మృతదేహం (వృత్తంలో).  ఎస్పీకి వివరాలు తెలుపుతున్న అధికారులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: నువాపడ జిల్లా లఖన ఠాణా పరిధిలోని కర్లాబహాలి అటవీ ప్రాంతంలో శనివారం ఓ మహిళ మృతదేహం వెలుగు చూసింది. మృతురాలిని జశబంతి నియాల్‌ (38)గా పోలీసులు గుర్తించారు. నువాపడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఠాణా అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. లఖన పంచాయతీలోని డంగర్‌పడ గ్రామానికి చెందిన మను నియాల్‌ భార్య జశబంతితో కలిసి శుక్రవారం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వచ్చాడని ఆయన  ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మను నియాల్‌ ఆమెను హతమార్చి, పరారైనట్లు ప్రాథమికంగా తెలిసిందని,. నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు. హత్య కేసుగా నమోదు చేశామని, ఆదివారం శాస్త్రీయ బృందం ద్వారా ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాన్ని శవపరీక్షకు తరలిస్తామని ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల చెప్పారు.


చరవాణుల దొంగ అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అభినవ్‌ సోంకర్‌

కొరాపుట్‌, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని ఆరోగ్యకేంద్రంలో చరవాణుల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పక్కా వ్యూహంతో ఎస్‌డీపీవో మనోజ్‌ కుమార్‌ పూజారి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకొని అరెస్టుచేశారు. శుక్రవారం  సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎస్పీ అభినవ్‌ సోంకర్‌ వివరాలు వెల్లడించారు. గత కొంత కాలంగా ఆరోగ్య కేంద్రంలో రోగులు, వారి సహాయకుల వద్ద ఉన్న డబ్బు, చరవాణులు చోరీకి జరుగుతున్నట్లు ఫిర్యాదు అందడంతో  ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌డీపీవో మనోజ్‌ కుమార్‌ పూజారి, ఐసీ ధీరేన్‌ పట్నాయక్‌లు ప్రత్యేక వ్యూహంతో దర్యాప్తు చేశారన్నారు. పట్టణంలోని బనబారతి కాలనీకి చెందిన యువకుడు రబీ బిస్వాస్‌ని అరెస్టుచేసి, అతని వద్ద నుంచి 51మంది చరవాణులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. త్వరలో వీటిని  బాధితులకు అందజేస్తామని ఎస్పీ చెప్పారు.


67 కిలోల గంజాయి స్వాధీనం

పట్టుకున్న గంజాయి మూటలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కారులో తరలిస్తున్న గంజాయిని సిమిలిగుడ పోలీసులు శుక్రవారం పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. నందపూర్‌ ఎస్‌డీపీవో సంజయ్‌ కుమార్‌ మహాపాత్ర్‌ అందించిన వివరాల ప్రకారం... నందపూర్‌ సమితి పాడువా ఠాణా అధికారి సవ్యసాచి సత్పతీ ఆధ్వర్యంలో పోలీసులు తయింటర్‌-బేజా కూడలి వద్ద  రాత్రి తనిఖీలో ఎక్స్‌యూబి కారులో మూటలతో ఉన్న గంజాయిని గుర్తించారు. చీకటిగా ఉండడంతో నిందితులు తప్పించుకొని పరారయ్యారు. కారుతో పాటు గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఠాణాలో తహసీల్దార్‌ నర్సిండ్‌ గడబ సమీక్షంలో మూటలను విప్పగా 67.5 కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని