logo

ఉలిక్కిపడ్డ రాష్ట్రం

ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌పై ఒక పోలీస్‌ అధికారి కాల్పులకు తెగబడి హత్య చేయడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి ఘటనలు లేకపోవడంతో ఇప్పుడు ఒడిశా అంతటా దీనిపై చర్చ కొనసాగుతోంది.

Updated : 30 Jan 2023 04:48 IST

మంత్రిపై కాల్పుల ఘటనతో చర్చ
సాధారణ పౌరుడు మాటేమిటి?
న్యూస్‌టుడే భువనేశ్వర్‌

ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌పై ఒక పోలీస్‌ అధికారి కాల్పులకు తెగబడి హత్య చేయడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి ఘటనలు లేకపోవడంతో ఇప్పుడు ఒడిశా అంతటా దీనిపై చర్చ కొనసాగుతోంది. మంత్రిపైనే దాడి జరిగితే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటన్న విమర్శలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హోంశాఖను స్వయంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై పలువురు ఆరోపణలు గుప్పిస్తుండగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్ట్రెచర్‌పై నబకిశోర్‌ దాస్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

ఝార్సుగుడలో తిరుగులేని నేత

కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నబకిశోర్‌ దాస్‌ ఝార్సుగుడ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. తర్వాత బిజదలో చేరి మంత్రి అయ్యారు. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఝార్సుగుడ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పరిశ్రమలు వెలిశాయి. ఆయా కంపెనీల యాజమాన్యాలతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయి. బిజద పార్టీకి నిధులు సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే సీఎం నుంచి ఇతర మంత్రులు, అగ్రనేతలంతా ఆయనను గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో దాస్‌కు మంచి మిత్రులతోపాటు శత్రువులూ ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఔషధాలు తీసుకోకుంటే వ్యాధి తిరగబెట్టే అవకాశం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌పై కాల్పులకు పాల్పడిన పోలీసు గోపాలకృష్ణ దాస్‌ మానసిక వ్యాధితో బాధపడుతూ బ్రహ్మపురలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో చికిత్సలు పొందుతున్నారని స్థానిక అంకులి పారిశ్రామికవాడలో నివాసముంటున్న ఆయన భార్య జయంతి దాస్‌ విలేకరులకు తెలిపింది. ఉదయం కుమార్తెతో వీడియో కాల్‌లో మాట్లాడారని, బాగానే ఉన్నారని తెలిపింది. సుమారు ఏడు నెలల కిందట ఇంటికి వచ్చారని, అప్పుడూ కుటుంబ సభ్యులతో ఆయన సాధారణంగా ఉండేవారని పేర్కొంది. దాస్‌ మానసిక వ్యాధికి చికిత్సలు అందించిన స్థానిక ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రి మానసిక విభాగం వైద్యుడు చంద్రశేఖర త్రిపాఠి సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. దాస్‌ ‘బైపోలార్‌ డిజార్డర్‌’తో బాధపడుతూ సుమారు ఎనిమిది సంవత్సరాల కిందట తన వద్దకు చికిత్సకు వచ్చారని చెప్పారు. ఉత్తేజంగా, చంచలంగా ఉండడం, నిద్రలేమితో బాధపడుతున్న ఆయనకు మూడు రకాల ఔషధాలు వాడాలని సూచించానని తెలిపారు. మళ్లీ సుమారు ఏడాది కిందట చికిత్సకు వచ్చారని, అవే ఔషధాలు వాడాలని చెప్పానన్నారు. ఔషధాలు వాడకుంటే రోగం తిరగబెట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘటన జరిగిన 12-24 గంటల్లోగా సమీపంలోని మానసిక వ్యాధి నిపుణులతో దాస్‌ మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయిస్తే ఆయన మానసిక స్థితి తెలుస్తుందని త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం ఆయన మందులు వాడుతున్నదీ లేనిదీ తెలియదన్నారు.

ప్రముఖుల సంతాపం

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఏఎస్‌ఐ కాల్పుల్లో మరణించిన మంత్రి నబకిశోర్‌ దాస్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఊహించని వార్త విన్నానన్న మోదీ.. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌ ఆచార్య గణేశీలాల్‌, సీఎం నవీన్‌,  ఇతర ప్రముఖులు నివాళులర్పించారు.


మసక బారిన ప్రతిష్ట

భువనేశ్వర్‌ అపోలో ఆసుపత్రిలో అధికారులతో మాట్లాడుతున్న సీఎం నవీన్‌

సాక్షాత్తూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హోంశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో 5-టీ, మో సర్కార్‌ అమలు చేసిన సీఎం పోలీసుశాఖ బాధ్యతగా విధులు నిర్వహిస్తోందని ప్రశంసించారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న ప్రతిపక్షాల ఆందోళనలకు ఈ ఘటన ఆజ్యం పోసింది. ఇటీవల నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌) విడుదల చేసిన నివేదికలో హత్యలు, అత్యాచార ఘటనల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. దీనిపై విపక్షాలు శాసనసభ లోపల, వెలుపల ఆందోళనలు చేస్తున్నాయి. ఇంతలో నవీన్‌ మంత్రివర్గ సహచరునిపై పోలీసు అధికారి కాల్పులు జరపడం హోంశాఖ వైఫల్యానికి అద్దం పట్టిందన్న ఆరోపణలు నవీన్‌ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాయి.


వైఫల్యానికి పరాకాష్ట

ఘటనపై పీసీసీ ఉపాధ్యక్షుడు గణేశ్వర బెహరా ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... హోంశాఖ పర్యవేక్షిస్తున్న నవీన్‌ వైఫల్యానికి ఈ ఘటన అద్దం పట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మంత్రులకే రక్షణ లేకపోతే సాధారణ పౌరులకెలా భద్రత కల్పిస్తారన్న విషయమై నవీన్‌ సమాధానం చెప్పాలన్నారు. మంత్రిపై కాల్పులను కాంగ్రెస్‌ ఖండిస్తోందని, విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని