logo

విజిలెన్స్‌ వలలో అవినీతి చేప

‘టాటా పవర్‌ సదరన్‌ ఒడిశా డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌’ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ విజిలెన్స్‌ అధికారులకు చిక్కాడు.

Published : 01 Feb 2023 03:43 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘టాటా పవర్‌ సదరన్‌ ఒడిశా డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌’ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ విజిలెన్స్‌ అధికారులకు చిక్కాడు. బ్రహ్మపుర కార్పొరేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రమోద్‌ కుమార్‌ చౌధురి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో బ్రహ్మపుర విజిలెన్స్‌ డివిజన్‌ మంగళవారం దాడులు చేపట్టింది. గంజాం, పూరీ జిల్లాలోని పది చోట్ల సోదాలు జరుగుతున్నాయి. స్థానిక సిద్ధార్థనగర్‌ మొదటి లైనులోని మూడంతస్తుల భవనం, అంకులి శశిభూషణనగర్‌ మూడో లైనులోని రెండంతస్తుల ఇల్లు, హరిపూర్‌లోని రెండంతస్తుల ఇల్లు, గౌంజులోని వ్యవసాయ క్షేత్రం, లుచ్ఛాపడ ప్రధాన రహదారిలో ఇల్లు, పిపిలిలోని ఓ ఫ్లాట్‌, అంబపువాలోని మరో ఫ్లాట్‌, సొంతూరు బాలకృష్ణపూర్‌లోని ఇల్లు, లుచ్ఛాపడ మెయిన్‌ రోడ్డులోని ఓ వ్యాపార సంస్థ, టీపీఎస్‌ఓడీఎల్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు విజిలెన్స్‌ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పైన పేర్కొన్న ఆస్తులతోపాటు బ్రహ్మపుర, ఛత్రపురం ప్రాంతాల్లో తొమ్మిది ఇళ్ల స్థలాలు, రూ.54,900ల నగదు, ఓ కారు, మూడు చక్రాల వాహనం ఒకటి, మూడు ద్విచక్ర వాహనాలు వెలుగు చూసినట్లు మరో ప్రకటనలో వెల్లడించింది. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సై, ఏఎస్సైలు ఇతర సిబ్బందితోపాటు జీఎస్టీ అధికారులు దాడుల్లో పాల్గొన్నారని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని