logo

నిలిచిన పనులు.. తప్పని పాట్లు

అరకభద్ర వద్ద ఉన్న బాహుదా నదికి ఇరువైపులా సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా వారంతా పోరాటం చేస్తూనే ఉన్నారు.

Published : 02 Feb 2023 02:18 IST

30 గ్రామాల ప్రజలకు నిత్యం అవస్థలు

అరకభద్ర సమీపంలో నిలిచిపోయిన వంతెన పనులు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అరకభద్ర వద్ద ఉన్న బాహుదా నదికి ఇరువైపులా సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా వారంతా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో పాటు గ్రామస్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో నదిలో నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటిని దాటుకుంటూ ఏటికి అవతలి వైపు ఉన్న గ్రామాలకు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో వరద తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఈ మేరకు దృష్టిసారించిన గత ప్రభుత్వం అరకభద్ర వద్ద వంతెన నిర్మాణానికి రూ.7.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. 2022 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపలేదు. గుత్తేదారునికి సకాలంలో బిల్లులు చెల్లించపోవడం తదితర కారణాల వల్ల పిల్లర్ల స్థాయితో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఇక్కడి యంత్రాలు, పరికరాలను గుత్తేదారు అక్కడి నుంచి తరలిస్తుండటంతో పనులు నిలిచిపోయాయనే ఆందోళన స్థానికులలో వ్యక్తమవుతోంది. పనులు అర్ధంతరంగా నిలిచిపోతే భారీ వర్షాలు, వరదల సమయంలో అరకభద్ర నుంచి కొళిగాంలోని ఉన్నత పాఠశాలలు, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం వెళ్లేందుకు ఇచ్ఛాపురం మీదుగా 24 కిలీమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో అధిక వ్యయప్రయాసలకు స్థానికుల గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.


ఎదురుచూపులు
- మంగి బాబూరావు, అరకభద్ర

అరకభద్ర నుంచి కొళిగాం వెళ్లాలంటే నదిని దాటాలి. ప్రస్తుతం నడుమ వరకు నీరు ఉండటంతో దాటుకుంటూ వెళుతున్నాం. వర్షాకాలంలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వెళ్లాలంటే వీలుకాదు. ఇచ్ఛాపురం నుంచి చుట్టూ తిరిగి 24 కిలోమీటర్లు ప్రయాణించాలి. రెండు నెలలుగా వంతెన పనులు జరగడం లేదు. మళ్లీ ప్రారంభించి ఈ ఏడాది వర్షాకాలం నాటికి అందిస్తారని ఎదురు చూస్తున్నాం.


త్వరలో ప్రారంభిస్తాం
- ధనుంజయరావు, జేఈ, పంచాయతీరాజ్‌ విభాగం

ప్రస్తుతం 55 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని