logo

మంత్రి హత్య ఘటనపైదర్యాప్తునకు కేంద్ర సాయం

ఆరోగ్యశాఖ మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య కేసులో అయిదు రోజుల తర్వాత డీజీపీ సునీల్‌ కుమార్‌ బన్సల్‌ శుక్రవారం పెదవి విప్పారు.

Published : 04 Feb 2023 03:08 IST

డీజీపీ సునీల్‌ కుమార్‌ బన్సల్‌

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆరోగ్యశాఖ మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య కేసులో అయిదు రోజుల తర్వాత డీజీపీ సునీల్‌ కుమార్‌ బన్సల్‌ శుక్రవారం పెదవి విప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జస్టిస్‌ జేపీ దాస్‌ ఆధ్వర్యంలో క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోందన్నారు. ఇలాంటి కీలకమైన కేసుల్లో రెండు మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదని, కొంత సమయం పడుతుందని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం కేంద్రం సహాయం కోరుతున్నట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖతో సంప్రదించామని, సాయం చేసేందుకు అంగీకారం తెలిపిందన్నారు. ఈమేరకు త్వరలో రాష్ట్రానికి దర్యాప్తు బృందం వస్తుందన్నారు. క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తులో పారదర్శకత కోసం ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్‌ అధికారులను బదిలీ చేసినట్లు వివరించారు.

తూటా లభ్యం

ఆరోగ్యశాఖ మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు ఇప్పటి వరకూ పురోగతి సాధించలేకపోయారు. క్రైమ్‌బ్రాంచ్‌ ఏడీజీ అరుణ్‌ బోత్రా నేతృత్వంలో మూడు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. గురువారం ఝార్సుగుడ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో నిందితుడు ఏఎస్‌ఐ గోపాల్‌ చంద్రసాహు రాసిన ఉత్తరానికి సంబంధించిన 12 ముక్కలు లభ్యమయ్యాయి. ఇవి తడిచిపోవడంతో అక్షరాలు కనిపించడం లేదు. కాల్పులు జరిగిన అనంతరం గోపాల్‌ చంద్రదాసును పోలీసులు గంటపాటు ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. ఆ సమయంలో ఆయన బాత్‌రూంకు వెళ్తానని చెప్పి సెప్టిక్‌ ట్యాంక్‌ వద్దకు వెళ్లి జేబులో ఉన్న ఉత్తరాన్ని చింపి టాయిలెట్‌ బేసిన్‌లో వేసి నీళ్లు కొట్టాడు. తర్వాత క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు గోపాల్‌ను విచారిస్తున్న సమయంలో ఆయన విషయం చెప్పడంతో సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి ఉత్తరం ముక్కలను బయటకు తీశారు. మరోవైపు మాజీ మంత్రికి తగిలిన బుల్లెట్‌ లభించినట్లు పోలీసులు ప్రకటించారు. బుల్లెట్‌ మంత్రి గుండె నుంచి వెళ్లి వీపు వైపు నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో గురువారం క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు గాలించడంతో ఇది దొరికింది. గోపాల్‌ వినియోగించిన పిస్టల్‌ను బిజద కార్యకర్త నుంచి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. హత్యానంతరం పిస్టల్‌ను నిందితుని నుంచి బిజద కార్యకర్తలు బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. క్రైమ్‌ బ్రాంచ్‌ ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని