logo

నేర వార్తలు

రాయగడ జిల్లా పద్మపురం సమితి గొయిబొంధు ఘాట్‌ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది.

Published : 06 Feb 2023 03:19 IST

వ్యాను బోల్తా.. ఒకరి మృతి

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా పద్మపురం సమితి గొయిబొంధు ఘాట్‌ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  నువాగుడ పంచాయతీ గుల్లుగూడ గ్రామం నుంచి ధాన్యంతో వస్తున్న వ్యాను గొయిబొంధొ ఘాట్‌ రోడ్‌లో బోల్తా పడింది. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి పడ్డారు. లోపల ఉన్న ముగ్గురు వ్యానులో ఇరుక్కు పోయారు. కెందుగుడ, పద్మపురం పోలీసులు, గుమడా అగ్నిమాపక కేంద్రం వారు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. లోపల ఉన్న వారిని అతి కష్టం మీద బయటకు తీసి పద్మపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మిలకా కుసొ అనే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. పద్మపురం, కెందుగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కంప్రెషర్‌ పేలుడు  ఇద్దరు కార్మికులు మృతి
ఐదుగురికి గాయాలు

కటక్‌, న్యూస్‌టుడే: నయాగఢ్‌ జిల్లాలోని ఈటామాటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సునాలాటి ప్రాంతంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తుండగా సంభవించిన పేలుడులో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని భువనేశ్వర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. గెయిల్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో గ్యాస్‌ గొట్టాల లోపల యంత్రంతో శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగి మహారాష్ట్రకు చెందిన సోనూ గంగూలీ (35), విజయ్‌ గంగూలీ(32) చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


తపాలా ఉద్యోగి ఆత్మహత్య

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న అదనపు పోస్ట్‌మాస్టర్‌ శనివారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నయాగఢ్‌ జిల్లాకి చెందిన సస్మిత సాహు(19) ఐదు నెలల క్రితం మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సబ్‌పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలో ఉన్న వెంకటపలం గ్రామీణ శాఖ తపాలా కార్యాలయంలో అదనపు పోస్ట్‌ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో టిగల్‌ పంచాయతీ తపాలా కార్యాలయం అదనపు మహిళా పోస్ట్‌ మాస్టర్‌ రేఖతో కలిసి ఉండేవారు. ప్రతిరోజు లాగే శనివారం రేఖ ఆఫీసులో పని పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సస్మిత నోట్లో నుంచి నురగ రావటం వాంతులు చేయడం గమనించి ఇరుగు పొరుగు వాళ్ల సహాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కలిమెల పోలీసులు సమాచారం తెలుసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నయాగడ్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. విషం తాగడానికి కారణాలు తెలియలేదు.  


240 కిలోల గంజాయి పట్టివేత

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర శివారులోని 16వ నెంబరు జాతీయ రహదారిపై జగన్నాథపూర్‌ (పుఖొడిబొంధొ) కూడలి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 240 కిలోల గంజాయిని అబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మురాదాబాద్‌ జిల్లా చందఖొడాకు (ఉత్తరప్రదేశ్‌)కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌ (39) అనే చోదకుడ్ని అరెస్టు చేసినట్లు ఆ విభాగం ఉప కమిషనర్‌ డంబురుధర ఖండా మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు. నిందితుడు గజపతి జిల్లా నుంచి బ్రహ్మపుర మీదుగా గంజాయిని లారీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు రవాణా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఉదయం జగన్నాథపూర్‌ కూడలి వద్ద కాపుగాసి లారీతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.


పులి నోటికి చిక్కి.. గాయాల పాలై

కటక్‌, న్యూస్‌టుడే: నువాపడా జిల్లా సినాపల్లి సమితి హీరాపూర్‌ గ్రామానికి చెందిన సేనాపతి మాఝి అనే వ్యక్తి.. శనివారం సాయంత్రం బంధువులను కలిసి వస్తుండగా పులి దాడికి గురయ్యాడు. ఆ మార్గంలో వెళ్తున్న కొంతమంది పెద్దగా కేకలు వేయడంతో సేనాపతి మాఝిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. సేనాపతి మాఝిని కాపాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అడవిలోకి పంపించారు.


బాణసంచా పేలుడు.. బ్రహ్మపుర లంజిపల్లిలో ఆదివారం సాయంత్రం వాలీబాల్‌ టోర్నీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బాణసంచా సామగ్రి కాల్చగా, బాణసంచా పేలి ఓ యువకుడి చేతి వేలు గాయపడింది. అతడ్ని చికిత్స నిమిత్తం ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు వార్తలు వచ్చాయి.

కొనసాగుతున్న దర్యాప్తు.. ఆరోగ్యశాఖ మాజీ మంత్రి దివంగత నబకిశోర్‌ దాస్‌ హత్య కేసులో బ్రహ్మపురలో దర్యాప్తు జరుపుతున్న క్రైంబ్రాంచికు చెందిన నలుగురు సభ్యుల బృందం ఆదివారం తిరిగి భువనేశ్వర్‌ వెళ్లినట్లు తెలిసింది. నిందితుడు ఏఎస్సై గోపాల్‌ దాస్‌ కుటుంబ సభ్యుల్ని, ఆయన బ్యాంకు ఖాతాల్ని, ఆయనకు మందులు అందజేసే బస్సు సిబ్బంది తదితరుల్ని అధికారుల బృందం విచారించి వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే.


83 ఎకరాల గంజాయి మొక్కలకు నిప్పు

గుణుపురం: రాయగడ జిల్లా పద్మపురం సమితిలో 83 ఎకరాల గంజాయి సాగును కాల్చి వేసినట్లు పోలీసు ఎస్‌డీపీవో బికాశ్‌ బెహురా తెలిపారు. శని, ఆది వారాలలో పద్మపురం సమితి కెందుగుడ ప్రాంతంలో పోలీసులు, అబ్కారీ విభాగ అధికారులు దాడులు జరిపారు. సుమారు 83 ఎకరాలు గంజాయి మొక్కలకు నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో  పద్మపురం అదనపు తహసీల్దారు ప్రాణకృష్ణ పాణీగ్రాహి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


గంజాయి కేసులో ఏడుగురి అరెస్ట్‌

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: గంజాయి కేసులో అబ్కారీ పోలీసులు ఏడుగురి నిందితులను అరెస్ట్‌ చేశారు. జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌ అభిరాం బెహరా వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ గుప్తేశ్వర్‌ ప్రధాన్‌ నేతృత్వంలో శని, ఆదివారాల్లో వివిధ చోట్ల దాడులు నిర్వహించిన సిబ్బంది ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 68.200 కిలోల గంజాయి, 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. దాయగడ రైల్వేస్టేషన్‌ సమీపంలో నలుగురు  కెరడ రహదారిలో ఒకరు, చందిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి రెంగలపాడు కూడలి వద్ద మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు ప్రీతిధర నాయక్‌ సీమాకిరణ్‌ బెక్‌ తదితరులు పాల్గొన్నారని బెహరా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని