logo

నిప్పు... అడవికి ముప్పు

రాష్ట్రంలో అటవీ అగ్ని ప్రమాదాలకు అడ్డులేకుండా పోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే కేవలం నెలరోజుల వ్యవధిలో 1200కి పైగా ఘటనలు వెలుగుచూడటం గమనార్హం.

Published : 06 Feb 2023 03:20 IST

ఈ ఏడాదిలో 1200కి పైగా ఘటనలు

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది (పాతచిత్రం)

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అటవీ అగ్ని ప్రమాదాలకు అడ్డులేకుండా పోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే కేవలం నెలరోజుల వ్యవధిలో 1200కి పైగా ఘటనలు వెలుగుచూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో వేసవిలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శీతాకాలం (జనవరి, ఫిబ్రవరి నెలల్లో) ఇన్ని ఘటనలు నమోదుకావడాన్ని పర్యావరణ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా మూడు రోజుల కిందట వరకు రోజుకి వందకు పైగా ఈ తరహా ప్రమాదాలు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. జనవరి మొదటి వారంలోనే నవరంగపూర్‌ మల్కాన్‌గిరి జిల్లాలో అటవీ అగ్ని ప్రమాదాలు నమోదు కావడాన్ని ఓ విశ్రాంత అటవీశాఖ అధికారి తప్పు పట్టారు. అడవులకు ప్రజలు నిప్పు పెట్టడంతో ప్రమాదాలు సంభవించాయని పేర్కొన్న ఆయన ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

నెలరోజుల వ్యవధిలో..

భారత అటవీ సర్వే (ఎఫ్‌ఎస్‌ఐ) గణాంకాల ప్రకారం.. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు రాష్ట్రంలో 1270 అటవీ అగ్నిప్రమాద ఘటనలు నమోదయ్యాయి. తాజాగా ఫిబ్రవరి 2న 161, 3న 106, శనివారం (4న) 113 ప్రమాదాలు వెలుగుచూశాయి. 2021లో రాష్ట్రంలో అత్యధికంగా 51,966 ఘటనలు నమోదైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి 15 తరువాత జరిగే ఈ తరహా ఘటనలు జూన్‌ వరకు ఐదు నెలలు మాత్రమే గతంలో కొనసాగగా ఈ ఏడాది జనవరి నుంచే మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది.


ప్రణాళికలు సిద్ధం చేశాం..
దేబిదత్త బిశ్వాల్‌, అటవీ సంరక్షణ ప్రిన్సిపల్‌ ఛీఫ్‌ (పీసీసీఎఫ్‌)

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారుచేశాం. జిల్లా, డివిజను స్థాయిలో అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని డివిజనల్‌ అటవీ అధికారులు (డీఎఫ్‌వో)కు సూచించాం. రానున్న వేసవిలో ఘటనల నియంత్రణకు అటవీ అగ్నిప్రమాద నివారణ సిబ్బందిని సిద్ధం చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని