logo

వంతెన నిర్మాణానికి చిక్కులు

కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వరం పంచాయతీ బొడఘాటి గ్రామం వద్ద శబరి నదిపై వంతెన నిర్మాణ పనులు రెండు నెలల క్రితం నిలిచిపోయాయి.

Published : 06 Feb 2023 03:26 IST

బొడఘాటి గ్రామస్థుల పడవ ప్రయాణం

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వరం పంచాయతీ బొడఘాటి గ్రామం వద్ద శబరి నదిపై వంతెన నిర్మాణ పనులు రెండు నెలల క్రితం నిలిచిపోయాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే పనులు దొరుకుతాయని, వాణిజ్యపరంగా వృద్ధి ఉంటుందని ఆశించిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. రెండు రాష్ట్రాల సమన్వయలోపంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయినట్లు పలువురు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ అటవీశాఖ అడ్డగింత..

రాష్ట్ర ప్రభుత్వం బిజుసేతు పథకం కింద వంతెన నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేసింది. 6 పిల్లర్లు నిర్మించ తలపెట్టగా మూడు పూర్తి చేశారు. మిగిలిన మూడు పిల్లర్లు నిర్మించాలంటే ఛత్తీస్‌గఢ్‌ భూభాగంలో పనులు చేయాలి. దాంతో జయపురానికి చెందిన గుత్తేదారుడు ఆ భూభాగంలో మట్టిని తవ్వి, నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు కావాల్సిన రూ. కోట్ల విలువైన సామగ్రిని అక్కడికి చేర్చి, అడ్డుగా ఉన్న చెట్లు నరికేందుకు జేసీబీలను పంపగా అక్కడి అటవీశాఖ అధికారులు వాహనాలను సీజ్‌ చేసి పనులు అడ్డగించారు. అనుమతి లేని స్థలంలో చెట్లు నరుకుతున్నట్లు ఆరోపించారు. దాంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర అధికారులతో సంప్రదించగా జేసీబీలను విడిచిపెట్టారు. కానీ నిర్మాణానికి అంగీకరించలేదు. దాంతో కోట్ల విలువ చేసే సామగ్రి అక్కడే ఉండిపోయింది.

బొయిపరిగుడ వద్ద అసంపూర్తిగా పనులు

వాణిజ్య అభివృద్ధిపై ఆశలు..

కొరాపుట్‌ జిల్లాలో బొయిపరిగూడ, కుంద్ర, కొట్పాడ్‌ సమితుల్లో దాదాపు 150 గ్రామాలు వంతెన నిర్మాణం జరిగితే అభివృద్ధి చెందుతాయి. దాంతో వేలమంది ప్రజలకు పనులు దొరుకుతాయని, వ్యాపారం జరుగుతుందని ఆశాభావంతో ఉన్న స్థానికులకు నిరాశే మిగిలింది.

నాటు పడవే దిక్కు..

150 గ్రామాలకు చెందిన ప్రజలకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌ వెళ్లేందుకు నేటికి నాటు పడవే శరణ్యం. వర్షాలు అధికంగా కురిస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ అటవీశాఖ సీజ్‌ చేసిన జేసీబీ వాహనాలు


అనుమతి ఇచ్చి అడ్డగించారు..
- కిశోర్‌ చరణ్‌ నాయక్‌, గ్రామీణాభివృద్ధి జూనియర్‌ ఇంజినీరు

వంతెన నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 148 చెట్లు తొలగించటానికి అనుమతి లభించింది. పనులు ప్రారంభించగా అటవీశాఖ వారు అడ్డుకున్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. త్వరలో నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కచ్చితంగా పచ్చజెండా ఊపుతుంది. పనులు పూర్తయితే శైవపీఠం గుప్తేశ్వర అభివృద్ధి చెంది, పర్యాటక, వ్యాపార రంగాలు ఊపందుకుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని