logo

నేడు, రేపు వర్షాలు: ఐఎండీ

బాలేశ్వర్‌ జిల్లాలో శనివారం కాలవైశాఖి (థండర్‌స్టార్మ్‌) ప్రభావం చూపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Published : 19 Mar 2023 03:10 IST

వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు (మ్యాప్‌లో పసుపు   రంగులో) (శనివారం ఐఎండీ విడుదల చేసిన చిత్రం)

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లాలో శనివారం కాలవైశాఖి (థండర్‌స్టార్మ్‌) ప్రభావం చూపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 80 మి.మీ. వర్షం కురిసినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. వాయుమండలంలో కొనసాగుతున్న ఆవర్తనం, పశ్చిమగాలులు, కాలవైశాఖి ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతున్నందున 20 వరకు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం కేంఝర్‌, మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, ఖుర్దా, నయాగఢ్‌ జిల్లాల్లో గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని, భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు చేశామన్నారు. మిగతా 19 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా జిల్లాల్లో పాక్షిక మబ్బులు కనిపించాయి. గాలుల తీవ్రత కనిపించింది. అక్కడక్కడా జల్లులు పడ్డాయని దాస్‌ చెప్పారు.

వడగళ్ల వాన: బాలేశ్వర్‌, మయూర్‌భంజ్‌, కలహడి, బౌద్ధ్‌, బొలంగీర్‌, నువాపడ, రాయగడ జిల్లాల్లో కాలవైశాఖి తీవ్ర ప్రభావం చూపిందని దాస్‌ చెప్పారు. సాయంత్రం అయిదు గంటల నుంచి భారీ వర్షాలు కురివడంతోపాటు వడగళ్లు పడ్డాయని తెలిపారు. బాలేశ్వర్‌ జిల్లాలోని నీలగిరి, రాయగడ జిల్లాలోని కాశీపూర్‌లో వడగళ్లు ఎక్కువగా పడ్డాయన్నారు.


పర్లాఖెముండిలో వర్షం


బజారు కూడలి ప్రాంతంలో వాన

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాలవైశాఖి ప్రభావంతో జిల్లాలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. వేసవితో సతమతవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. నువ్వు పంట రైతులు ఆనందం వ్యక్తం చేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు