పాలిస్తున్నదెవరు?
రాష్ట్రంలో అధికారుల పాలన సాగుతోందని, మంత్రులు నామమాత్రంగా మిగిలారన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నా తాజా ఘటనతో తీవ్రమయ్యాయి. ఈ ఘటన శాసనసభలో చర్చకు దారి తీసింది.
మంత్రులా..? అధికారులా..?
శూన్యగంటలో విపక్షాల నిలదీత
భువనేశ్వర్, న్యూస్‌టుడే
రాష్ట్రంలో అధికారుల పాలన సాగుతోందని, మంత్రులు నామమాత్రంగా మిగిలారన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నా తాజా ఘటనతో తీవ్రమయ్యాయి. ఈ ఘటన శాసనసభలో చర్చకు దారి తీసింది. చేనేత, జౌళిశాఖ మంత్రి రీతాసాహు శుక్రవారం రాత్రి లోక్‌సేవా భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రదీప్‌కుమార్ జెనాను కలిసి తమశాఖ తరఫున రూ.75 వేల చెక్కును ముఖ్యమంత్రి పేరిట అందజేశారు. ఈ ఫొటోను సమాచార, పౌరసంబంధాలశాఖ విడుదల చేసింది. దీనిపై శనివారం శాసనసభ శూన్యగంట
(జీరో అవర్)లో దుమారం రేగింది. సభా కార్యక్రమాలు స్తంభించాయి. సాయంత్రం వరకు వాయిదా పడింది.
నిలదీసిన నర్సింగమిశ్ర
కాంగ్రెస్ సభాపక్షం (సీఎల్పీ) నేత నర్సింగమిశ్ర మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారుల వద్ద మోకరిల్లుతోందా? అని అడిగారు. మంత్రి రీతా సాహు ముఖ్యమంత్రి వద్దకెళ్లి చెక్కు అందజేయకుండా సీఎస్ వద్దకు వెళ్లడమేంటని అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు అధికారుల వద్దకెళ్లే దుస్థితి ఎక్కడైనా ఉందా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో అధికార స్వామ్యం పెచ్చుమీరిందని, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని, దీన్ని ప్రజాస్వామ్య పాలనగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. మంత్రి రీతా సాహు దీనిపై సభలో క్షమాపణ కోరాలని నర్సింగ మిశ్ర డిమాండ్ చేశారు. సీఎస్ కూడా వివరణ ఇవ్వాలన్నారు.
మంత్రులందర్నీ ఎందుకంటారు?
కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో జోక్యం చేసుకున్న ఆర్ధిక, సభా వ్యవహారాల శాఖ మంత్రి నిరంజన్ పూజారి మాట్లాడుతూ రీతా సాహు చేసిన పనికి మంత్రులందరినీ విమర్శించడం తగదన్నారు. తమ నేత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని, ఆయనకే మంత్రులంతా గౌరవిస్తారని, ఆయనకే జవాబుదారీగా ఉన్నారని వివరించారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా మంత్రులందర్నీ సభలో నిందించడమేంటని ప్రశ్నించారు.
అమాత్యులు నిస్సహాయులు
విపక్షనేత జయనారాయణ మిశ్ర శనివారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మంత్రులు నిస్సహాయులుగా మిగిలిపోయారని, పాలనంతా అధికారుల చేతుల్లోనే ఉందన్నారు. బుక్ సర్క్యులర్-47 ఉల్లంఘనకిది అద్దం పడుతోందని వివరించారు. మంత్రులు అధికారుల వద్దకెళ్లడం, వారికి నమస్కరించడం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకిది తూట్లు పొడిచేలా ఉందన్నారు.
మా నేత నవీన్
ఈ విషయం చర్చనీయాంశం కావడంతో రెవెన్యూ, విపత్తుల నివారణశాఖ మంత్రి ప్రమీలా మల్లిక్ సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. తమ నేత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని, ఆయనకే గౌరవిస్తున్నామన్నారు. ఓర్వలేని విపక్ష నేతలు కొన్ని ఫొటోలు ఎడిట్ చేయించి ఉద్దేశపూర్వకంగా సభలో చూపిస్తూ ప్రసార సాధనాల దృష్టిలో పడడానికి ఎత్తుగడ వేశారని ఆరోపించారు.
దీనికేం చెబుతారు?
ఇంతలో భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్ మాఝి సభలో మరికొన్ని ఫొటోలు ప్రదర్శించారు. సీఎం వద్ద ఒక అధికారికి మంత్రి నిరంజన్ పూజారి నమస్కరిస్తున్న ఫొటో చూపించి దీనికి మీరేం సమాధానమిస్తారని ప్రశ్నించారు. నిరంజన్ ఒక్కరే కాదని, మంత్రుల్లో చాలామంది సీఎం వద్ద ఉన్న అధికారికి ప్రణమిల్లుతున్నారని మోహన్ అన్నారు. తాను నవీన్‌కు నమస్కరించానని, అధికారికి కాదని, ఈ ఫొటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేశారని మంత్రి నిరంజన్ పూజారి సభ లోపల, వెలుపల చెప్పారు. ఈ అంశంపై సభలో విపక్షాలు, పాలకపక్షం సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
నవరంగపూర్‌లో దుస్థితి చూడండి
మోహన్ మాఝి విలేకరులతో మాట్లాడుతూ... నవరంగపూర్‌లో ఉన్న 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్ ప్రజల వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారని, పాలకపక్షం ఎమ్మెల్యేలు ఆయనున్న అతిథి భవనం వద్ద కాపలా కాస్తూ ప్రజలను నియంత్రిస్తున్నారని, ఈ దృశ్యాలు ప్రసార సాధనాల్లో ప్రసారం అయ్యాయన్నారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు. నవరంగపూర్ కలెక్టరు ఉండగా, సీఎం వద్ద ఉన్న అధికారి ప్రజా సమస్యల పరిష్కారం పేరిట ఆ ప్రాంతానికి వెళ్లడం ఏమిటని నిలదీశారు.
మాజీ మంత్రి హత్యకేసు దర్యాప్తు ఏమైంది?
జయనారాయణ మిశ్ర
భువనేశ్వర్, న్యూస్‌టుడే: మాజీ మంత్రి నబకిశోర్ దాస్ హత్య జరిగి 50 రోజులైందని, ఈ కేసు దర్యాప్తు ఏమైందని విపక్షనేత జయనారాయణ మిశ్ర ప్రశ్నించారు. శనివారం శాసనసభ శూన్యగంట(జీరో అవర్)లో ఈ అంశాన్ని లేవనెత్తిన జయనారాయణ నిందితుడు గోపాల్ దాస్‌ను మానసిక వ్యాధిగ్రస్థునిగా నిరూపించడానికి దర్యాప్తు సంస్థ ఎందుకింత శ్రద్ధ చూపుతోందని నిలదీశారు. కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ఆసుపత్రి నిపుణులు గోపాల్‌దాస్ వ్యాధిగ్రస్థుడు కాడని స్పష్టం చేసిన తర్వాత మరిన్ని పరీక్షలకు అనుమతించాలని కోర్టుకు క్రైంబ్రాంచ్ కోరడంలో పరమార్ధమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా (ఎఫ్‌బీఐ) సాయం కోసం కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ ప్రతులు సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ బాధ్యత పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని హైకోర్టును కోరిన లేఖ ప్రతులనూ సభలో ఉంచాలని డిమాండ్ చేశారు. హత్యకేసు నీరుగార్చడానికి కుట్ర జరిగిందని, దర్యాప్తు సంస్థను పావుగా ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
విద్యాశాఖ లోపాల పుట్ట: పదో తరగతి పరీక్షల ప్రారంభం నుంచి ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, ముద్రణలో లోపాలపై విద్యాశాఖ ఎందుకు మౌనంగా ఉందని జయనారాయణ ప్రశ్నించారు. శనివారం జరిగిన సామాజిక శాస్త్రం పరీక్ష పత్రాల ముద్రణలో తప్పులు ఉన్నాయని బోర్డు అధికారులు అంగీకరించడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం కాదా? అంటూ నిలదీశారు. రూ.40 వేలు చెల్లిస్తే కేంద్రాల్లో కాపీలు ఇస్తామంటున్న వారి వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని, ప్రాథమిక విద్యాశాఖ లోపాలపుట్టగా నిరూపించుకుందని, బాలబాలికల డ్రాప్‌ఔట్‌లను తేలిగ్గా తీసుకుంటున్నారని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 5టీ, మోసర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న వారు దీనిపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్