logo

మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ రాజీనామాకు పట్టు

గడిచిన మూడేళ్లలో నదుల్లో స్నానాలు చేస్తూ 970 మంది జల సమాధి అయ్యారని హోంశాఖ సహాయమంత్రి తుషారకాంతి బెహరా తెలిపారు.

Published : 21 Mar 2023 03:16 IST

10 పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌పై  విపక్షాల నినాదాలు 

పోడియం వద్ద సోమవారం విపక్షాలు నినాదాలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ రాజీనామా చేయాలని విపక్షాలు సోమవారం శాసనసభలో డిమాండ్‌ చేశాయి. సభ ప్రారంభం కాగానే ఆర్ధికశాఖ మంత్రి నిరంజన్‌ పూజారి సాధారణ పాలనా విభాగం పద్దుల వివరాలు చదవడానికి సిద్ధమయ్యారు. భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వద్దకెళ్లి నినాదాలు చేశారు. 10 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయని, నవీన్‌ ప్రభుత్వం బాలబాలికల భవిష్యత్తును కాలరాస్తోందని ఆరోపించారు. చేతకాని విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ప్రశ్నపత్రాల లీక్‌పై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. విపక్షసభ్యుల నినాదాల మధ్య ఆర్ధికశాఖ మంత్రి వివరాలు చదవలేక నిస్సహాయంగా ఉండిపోయారు. దీంతో సభాపతి కార్యక్రమాలను సాయంత్రం వరకు వాయిదా వేశారు.


మూడేళ్లలో 970 మంది మృతి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గడిచిన మూడేళ్లలో నదుల్లో స్నానాలు చేస్తూ 970 మంది జల సమాధి అయ్యారని హోంశాఖ సహాయమంత్రి తుషారకాంతి బెహరా తెలిపారు. సోమవారం శాసనసభలో బిజద ఎమ్మెల్యే సౌబిక్‌ బిశ్వాల్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 613 మందిని వివిధచోట్ల కాపాడారని, ప్రవాహాల వద్ద స్వీయ చిత్రాలు తీసుకోవడానికి ప్రయత్నించడం, ఈత రానివారు స్నానాలకు దిగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

బీఎస్‌కేవై సంజీవని... కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బిజు స్వాస్థ కళ్యాణ యోజన (బీఎస్‌కేవై) ఉత్తమమైనదని, ఇది రోగుల పాలిక సంజీవనిగా నిలుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి నిరంజన్‌ పూజారి చెప్పారు. సోమవారం శాసనసభలో ఎమ్మెల్యే నవురి నాయక్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బీఎస్‌కేవై ద్వారా రాష్ట్రంలోని 96.5 లక్షల కుటుంబాలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అమల్లో ఉందన్నారు. మహిళలకు ఏడాదిలో రూ.10 లక్షలు, పురుషులకు రూ.5 లక్షల వరకు చికిత్సల వ్యయం ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు.


సాయంత్రం సభలో పద్దులపై చర్చ

శాసనసభ సోమవారం సాయంత్రం కొలువుదీరిన తర్వాత విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ... 10 పరీక్షల్లో తప్పిదాలు జరగలేదని, విద్యార్థుల భవిష్యత్తుకు, ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. అనంతరం సభలో ప్రశాంతత నెలకొంది. ప్రణాళిక, సమన్వయం, పర్యటక, సాంస్కృతిక శాఖలకు సంబంధించి ఈ ఏడాది (2023-24) బడ్జెట్‌ కేటాయింపులు, పద్దులపై చర్చ చేపట్టారు. ఆయాశాఖల మంత్రులు రాజేంద్ర డోల్కియా, అశ్వినీ పాత్ర్‌ మాట్లాడుతూ నిధులు, పనుల గురించి వివరించారు. ఇంతవరకు 15 శాఖల పద్దులపై చర్చ జరిగింది.


అంతా అబద్ధం

మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ విలేకరులతో మాట్లాడుతూ... విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమన్నారు. ఒక్క సబ్జెక్టు ప్రశ్నపత్రం ముద్రణలో స్వల్ప తప్పిదాలు జరిగాయని వివరించారు. ఏప్రిల్‌ 3 నుంచి 56 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభం కానుందని, ఈ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతాయని విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సోమవారం గణితం ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని, తాను పూరీ కలెక్టరు, జిల్లా విద్యాధికారి (డీఈఓ), బోర్డు అధికారులతో మాట్లాడానని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు.  దీనిపై దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా సభలో దీనిపై రాద్ధాంతం చేసి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకున్నాయన్నారు.


విద్యాశాఖ మంత్రి జిల్లాలో...

సభ వాయిదా పడిన తర్వాత భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి విలేకరులతో మాట్లాడుతూ... విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పూరీ జిల్లాల్లోని అనేక కేంద్రాల్లో సోమవారం గణిత పరీక్ష ప్రశ్నపత్రం ఉదయం 7.20 గంటలకు లీక్‌ అయిందని ఆరోపిస్తూ వాటిని చూపించారు. ఈ నెల 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాగా నిత్యం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభానికి ముందే కనిపించాయని, మంత్రి చోద్యం చూస్తున్నారని, ఆయన పదవిలో కొనసాగడానికి తగరని, రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


ప్రైవేటు విద్యాసంస్థలతో ఫిక్సింగ్‌

కాంగ్రెస్‌ నేత తారాప్రసాద్‌ బాహినీపతి విలేకరులతో మాట్లాడుతూ... బిజద పెద్దలు ప్రైవేటు విద్యాసంస్థలతో ఫిక్సింగ్‌ చేసుకుని ప్రశ్నపత్రాలు లీక్‌ చేయించారన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును కాల రాయడానికి కుట్ర జరిగిందని, విద్యా ప్రమాణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పూరీ జిల్లాలో వరుస ఘటనలు దుస్థితికి అద్దం పడుతున్నాయన్నారు.


గోపాల్‌దాస్‌కు ఆరోగ్య సమస్యల్లేవు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య కేసులో నిందితుడు గోపాల్‌దాస్‌ ఆరోగ్యవంతుడని, ఆయన మానసిక వ్యాధిగ్రస్తుడు కాదని హోంశాఖ సహాయమంత్రి తుషార కాంతి బెహరా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సభాపక్షం (సీఎల్పీ) నేత నర్సింగ మిశ్ర అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పదేళ్ల క్రితం పోలీసు యంత్రాంగానికి తెలియజేయకుండా రెండు నెలలు సెలవులో ఉన్న గోపాల్‌దాస్‌ బ్రహ్మపుర ఎమ్కేసీజీ వైద్యకళాశాల ఆసుపత్రిలో మానసిక వ్యాధికి సంబంధించి చికిత్స చేయించుకొని ఫిట్‌నెస్‌ ధ్రువపత్రంతో వచ్చి విధుల్లో చేరినట్లు తెలిపారు. గడిచిన పదేళ్ల సర్వీసులో ఆయన ఎక్కడా తప్పు చేయలేదని, 229 కేసులు పరిశీలించాడని, ఇటీవల కాలంలో సెలవులు అడగలేదని చెప్పారు. సమర్ధంగా విధులు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. శాసనసభ కొలువుదీరినప్పటి నుంచి ఇంతవరకు నిత్యం మాజీ మంత్రి హత్య కేసుకు సంబంధించి నిలదీస్తున్న విపక్షాలు గోపాల్‌దాస్‌ను మానసిక వ్యాధిగ్రస్తునిగా చిత్రీకరించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని, క్రైంబ్రాంచ్‌ దర్యాప్తు తప్పుదోవ పట్టిందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది.


బీరేంద్ర పాండే సేవలు చిరస్మరణీయం: నవీన్‌

బీరేంద్ర సేవలు వివరిస్తున్న నవీన్‌ పట్నాయక్‌

బీరేంద్ర పాండే రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతితో ఉన్నతాశయాలు గల నేతను కోల్పోయామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. సోమవారం శాసనసభ కొలువుదీరినంతనే సీఎం ఝార్సుగుడ మాజీ ఎమ్మెల్యే బీరేంద్ర ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం ప్రస్తావించి ఆయన సేవల గురించి వివరించారు. భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి, కాంగ్రెస్‌ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర బీరేంద్రను జనప్రియ నేతగా అభివర్ణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సభ్యులంతా ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. తర్వాత సభాపతి బిక్రంకేసరి అరుఖ్‌ తీర్మానం వివరాలు చదివి వినిపించి బీరేంద్ర కుటుంబ సభ్యులకు పంపిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని