logo

యువతలో కంప్యూటర్‌ నైపుణ్యాలు అంతంత మాత్రమే

రాష్ట్ర యువతలో కంప్యూటర్‌ నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 20.6 శాతం యువత మాత్రమే ఫైల్స్‌ జోడించడం, ఈమెయిల్స్‌ పంపడం వంటి ప్రాథమిక కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగి ఉండడం గుబులు రేపుతోంది.

Published : 21 Mar 2023 03:16 IST

ఎస్‌ఎస్‌ఎస్‌వో తాజా నివేదికలో వెల్లడి

శిక్షణ పొందుతున్న యువతులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర యువతలో కంప్యూటర్‌ నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 20.6 శాతం యువత మాత్రమే ఫైల్స్‌ జోడించడం, ఈమెయిల్స్‌ పంపడం వంటి ప్రాథమిక కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగి ఉండడం గుబులు రేపుతోంది. ఈ గణాంకాలను మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే కార్యాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌వో) 78వ రౌండ్‌ నివేదిక బహిర్గతం చేసింది. వాటి ప్రకారం... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) ప్రోగ్రాం కింద జనవరి 2020, ఆగస్టు 2021ల మధ్య ఎస్‌ఎస్‌ఎస్‌వో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో వివిధ అంశాల్లో అభివృద్ధితోపాటు కంప్యూటర్‌ వినియోగంలో పరిజ్ఞానంపై సర్వే చేపట్టారు. రాష్ట్రంలో 15-24 ఏళ్ల మధ్య యువతలో చాలామంది వివిధ సమాచార, సాంకేతిక అంశాలకు సంబంధించి సరైన ప్రదర్శన చేయలేకపోవడం గమనార్హం. 15-29 ఏళ్ల మధ్య వారిలో ఇది మరింత తగ్గి 19.3 శాతంగా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కంప్యూటర్‌ నైపుణ్యానికి సంబంధించి తొమ్మిది అంశాల్లో యువత పరిజ్ఞానాన్ని పరీక్షించినట్లు నివేదిక స్పష్టం చేసింది.


అంతంతమాత్రం.. అంతర్జాల సౌకర్యం

రాష్ట్రవ్యాప్తంగా కేవలం 24.8 శాతం కుటుంబాలకు మాత్రమే అంతర్జాల సదుపాయం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇది జాతీయ సగటు (32.1 శాతం) కంటే 7.3శాతం తక్కువగా ఉండడం గమనార్హం. కంప్యూటర్‌ అక్షరాస్యత రేటు అంశంలోనూ కేవలం 32.2 శాతంతో పొరుగు రాష్ట్రాలైన ఏపీ (45.5 శాతం), తెలంగాణ (53.8), పశ్చిమ్‌బెంగాల్‌ (43.1) కంటే వెనుకబడి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 15-29 ఏళ్ల వారిలో కేవలం 1.2 శాతం మంది మాత్రమే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, పురుషులు, మహిళలపరంగా చూస్తే కంప్యూటర్‌ పరిజ్ఞానంలో ఆయా కేటగిరీల మధ్య చాలా  వ్యత్యాసమున్నట్లు బహిర్గతం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని