logo

సభలో మహానది వివాదం

శాసనసభలో గురువారం మహానది వివాదం పాలక, విపక్షాల పరస్పర ఆరోపణలకు దారితీసింది. దీంతో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు.

Updated : 24 Mar 2023 05:44 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: శాసనసభలో గురువారం మహానది వివాదం పాలక, విపక్షాల పరస్పర ఆరోపణలకు దారితీసింది. దీంతో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. ఉదయం సభాపతి బిక్రంకేసరి అరుఖ్‌ సభా కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వద్దకొచ్చి నినాదాలు చేశారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం మహానది జలాలను కాపాడడంలో విఫలమైందని దుయ్యబట్టారు. దీంతో బిజద సభ్యులు కలగజేసుకొని కేంద్రంలోని భాజపా, ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ పాలకులపై ఆరోపణలు గుప్పించారు. సభలో ఉద్రిక్తత నెలకొనగా కార్యక్రమాలు సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి.

23 ఏళ్లు ఏం చేశారు?.. అనంతరం భాజపా పక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి విలేకరులతో మాట్లాడుతూ... 23 ఏళ్లుగా పాలిస్తున్న నవీన్‌ మహానది పరివాహక ప్రాంతంలో 9 ఆనకట్టల నిర్మాణం చేస్తామని చెప్పినా ఇంతవరకు ఒక్కటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం నిర్మాణాలు చేపడుతోందని, ఈ పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం మినహా బిజద నేతలు ఏం సాధించారని ప్రశ్నించారు. అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోలేకపోయిన పాలకులు ఉద్దేశపూర్వకంగా ఛత్తీస్‌గఢ్‌కు సహకరించారన్నారు. సభలో ఈ అంశాన్ని లేవనెత్తితే సభాపతి ద్వారా సభను వాయిదా వేయిస్తున్నారన్నారు.

జల వనరులకు కొదవలేదు.. కాంగ్రెస్‌, సభాపక్షం నేత నర్సింగ మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ... పుష్కల జల వనరులున్న రాష్ట్రానికి వేసవిలో నీటి ఎద్దడి ఎదురవడం సిగ్గు చేటన్నారు. హిరాకుడ్‌ నిర్మాణం తర్వాత మహానది పరివాహక ప్రాంతంలో మరో భారీ ప్రాజెక్టు కలగానే మిగిలిపోయిందని, నవీన్‌ సుదీర్ఘ పాలనంతా చవకబారు పథకాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నదీ జలాల నిర్వహణకు సంబంధించి ఇంతవరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయలేకపోయిన ప్రభుత్వం తన అసమర్ధత అంగీకరించకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తోందన్నారు.

కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌లు జవాబుదారీ.. బిజద సీనియర్‌ నేత, పార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్‌ జెనా విలేకరులతో మాట్లాడుతూ... మహానది జల వివాదానికి కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జవాబుదారీ అన్నారు. జలవనరుల చట్టాలను అతిక్రమించి ఏకపక్షంగా నిర్మాణాలు చేసిన పొరుగు రాష్ట్రానికి కేంద్రం సహకరించిందన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు అన్నదమ్ముల్లా వ్యవహరించాయన్నారు. దీనిపై సభలో విపక్షాలు ఆందోళన చేసి కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయని, విలువైన సభా సమయాన్ని వృథా చేశాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని