logo

ఖుర్దాలో ఇరువర్గాల ఘర్షణ

ఖుర్దా జిల్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దెవులి గ్రామంలో బుధవారం రాత్రి రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు.

Published : 24 Mar 2023 01:53 IST

గ్రామంలో దగ్ధమవుతున్న వాహనాలు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఖుర్దా జిల్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దెవులి గ్రామంలో బుధవారం రాత్రి రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు. దాడుల్లో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌, ఉప కలెక్టర్‌, ఎస్డీపీవో, తహసీల్దార్‌పాటు పలువురు పోలీస్‌ అధికారులు గ్రామానికి చేరుకొని ఘర్షణలు నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు ప్లటూన్ల పోలీసు బలగాలను నియమించారు. గత పంచాయతీ ఎన్నికల నుంచి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏడాది జనవరిలో ఈ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పట్లో పలువురు అరెస్టయ్యారు. గ్రామంలో ఉంటున్న హరి బలియార్‌ సింగ్‌ కుమారుడు ప్రదీప్‌ కూడా ఇటీవల జరిగిన ఘర్షణలో అరెస్టయ్యాడు. వారం రోజుల క్రితం ఆయన బయటకు వచ్చాడు. మంగళవారం ఆయన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమంది దాడి చేసి గ్రామ శివారులో ఉన్న తోటలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్‌ తండ్రి మద్దతదారులతో అక్కడికి చేరుకొని గాయపడిన ప్రదీప్‌ను భువనేశ్వర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ప్రదీప్‌ మృతి చెందాడు. ఈ ఘటనకు స్థానిక సర్పంచి కారణమని ఆరోపిస్తూ ప్రదీప్‌ మద్దతదారులు బుధవారం రాత్రి బెగునియా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ధర్నా, 57వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సర్పంచి వర్గానికి చెందిన వారి రెండు నాలుగు చక్రాల వాహనాలకు, పొలంలోని ధాన్యం కుప్పలకు నిప్పంటించారు. దీంతో గ్రామంలో పోలీసులు 144వ సెక్షన్‌ అమలు చేశారు. ఆందోళనకారులతో చర్చించి ప్రదీప్‌ కుటుంబానికి తాత్కాలికంగా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు హత్య నేరం కింద ఫిర్యాదు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని