logo

బంగారు నగలకు హాల్‌ మార్క్‌ తప్పనిసరి

పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తాము కొనుగోలు చేస్తున్న బంగారం నాణ్యతపై ఎంతోమంది వినియోగదారులకు సందేహాలు రావడం సహజం.

Published : 26 Mar 2023 03:27 IST

ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తాము కొనుగోలు చేస్తున్న బంగారం నాణ్యతపై ఎంతోమంది వినియోగదారులకు సందేహాలు రావడం సహజం. ఇకపై ఆ అనుమానాలకు తెరదించుతూ నగల దుకాణాల్లో విక్రయించే అన్ని రకాల బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేస్తూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) తేల్చి చెప్పింది. దీంతో ఎంతో ఆశ, నమ్మకంతో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోయేందుకు ఆస్కారం లేదని బీఐఏస్‌ పేర్కొంది. ఈ విషయమై బీఐఎస్‌ అధిపతి (భువనేశ్వర్‌) జగన్నాథ మాఝి మాట్లాడుతూ... ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి హెచ్‌యూఐడీ హాల్‌మార్క్‌ లేకుండా నగల విక్రయాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలతోపాటు ఆ దుకాణాన్ని సీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. 9 జిల్లాల్లో హాల్‌మార్క్‌ ఉన్న బంగారు నగలను తప్పనిసరిగా విక్రయించాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు కానుంది.


వినియోగదారులకు ఎంతో మేలు..

బీఐఎస్‌ శాస్త్రవేత్త సౌరవ్‌ చంద్ర మాట్లాడుతూ... ఈ కొత్త విధానంతో బంగారం కొనుగోళ్లలో వినియోగదారులకు ఎంతో మేరు చేకూరనుందన్నారు. ఏప్రిల్‌ 1 తరువాత విక్రయించే నగలకు మూడు ప్రత్యేక మార్కులుంటాయని ఆయన పేర్కొన్నారు. వాటిలో మొదటిది బీఐఎస్‌ లోగో కాగా, రెండోది స్వచ్ఛతకు సంబంధించిన ముద్ర, హాల్‌మార్క్‌ ఏకీకృత గుర్తింపు (హెచ్‌యూఐడీ)తో ఆరు నెంబర్ల కోడ్‌ కలిగి ఉన్న మరో ముద్ర ఉండనుందని సౌరవ్‌ స్పష్టం చేశారు. ఈ కోడ్‌ వల్ల ఏ నగ గురించి అయినా సులభంగా గుర్తించేందుకు వీలుంటుందని ఆయన వెల్లడించారు. బీఐఎస్‌ కోర్‌ యాప్‌ ద్వారా కేవలం బంగారం స్వచ్ఛత మాత్రమే కాకుండా నగలకు సంబంధించి తయారీదారు, సంస్థ షోరూం తదితర వివరాలను వినియోగదారుడు తెలుసుకోవచ్చని బీఐఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతానికి 28 హాల్‌మార్క్‌ కేంద్రాలు ఉండగా, తాజా నిర్ణయంతో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని