logo

జగన్నాథ సంస్కృతి విలక్షణం

జగన్నాథ సంస్కృతి విలక్షణం.. విశ్వవ్యాప్తమని, సమైక్యతకు నిలువుటద్దంగా నిలుస్తోందని, ఉత్కళవాసులు శాంతి కాముకులని కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు.

Published : 26 Mar 2023 03:27 IST

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

పూరీ జిల్లా పిపిలి కళాఖండాలు చూస్తున్న మంత్రులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: జగన్నాథ సంస్కృతి విలక్షణం.. విశ్వవ్యాప్తమని, సమైక్యతకు నిలువుటద్దంగా నిలుస్తోందని, ఉత్కళవాసులు శాంతి కాముకులని కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ‘ఒడిశా పరబ్‌-2023’ మూడు రోజుల ఉత్సవాలను సహచర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిరణ్‌ రిజిజులతో కలిసి ప్రారంభించిన కిషన్‌ రెడ్డి కళింగ సంస్కృతి వైభవం అనంతమన్నారు. ధర్మేంద్ర మాట్లాడుతూ... ఉత్కళ రాష్ట్రం అన్ని కళలకు నిలయమన్నారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లు నిలిచిపోయిన పరబ్‌ వేడుకలు ఈ ఏడాది హస్తినలో మళ్లీ ఏర్పాటు కావడం ఆనందకరమని, ఒడియా సమాజ్‌ ప్రతినిధుల కృషి అభినందనీయన్నారు. ఇక్కడ రాష్ట్రానికి చెందిన వైవిధ్యమైన కళాఖండాలు, నేత వస్త్రాలు, వంటకాలు ప్రదర్శితమయ్యాయి. ఖ్యాతిగాంచిన మయూర్‌భంజ్‌ జిల్లా ‘ముడి మంసొ’ (మరమరాలతో తయారు చేసిన వంటకం) ఆరగించిన మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశంసించారు. ఛెన్నాపుడొ, రసాబలి, ఖరి, కిచిడీ, చేపలు, పీతల ఇగురు తదితర వంటకాలను అతిథులు రుచి చూశారు. ఆదివారం వరకు కొనసాగనున్న వేడుకల్లో వినోద ప్రదర్శనలూ ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో దిల్లీలో ఉన్న ఒడిశా వాసులు, ఇతర నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వంటకాలు తిలకిస్తున్న కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర, కిరణ్‌ రిజిజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని