logo

రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

ప్రజలందరి సహకారంతో గంజాం జిల్లాను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా చేద్దామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు.

Published : 27 Mar 2023 01:58 IST

గంజాం జిల్లాలో సీఎం నవీన్‌ పర్యటన
సాహితీవేత్తలకు జన్మనిచ్చిన నేలగా అభివర్ణన

గంజాం జిల్లా వాసులకు అభివాదం చేస్తూ..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రజలందరి సహకారంతో గంజాం జిల్లాను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా చేద్దామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం గంజాం జిల్లాలో పర్యటించిన ఆయన కవిసూర్యనగర్‌, హింజిలికాటు, ఛత్రపురంలలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 22 సమితుల్లో సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన 590 అభివృద్ధి పనుల ప్రారంభించి, 235 పనులకు భూమిపూజ చేశారు. 20 వేల మందికి గ్రామకంఠ పట్టాలు అందజేశారు. మిషన్‌ శక్తి కింద 22,197 మహిళా స్వయం సంఘాలకు రూ.619.62 కోట్ల రుణాలు అందజేశారు. ప్రసంగించే ముందు జిల్లా ఆరాధ్యదైవం తరాతరిణిను స్మరించుకున్నారు.

50 వేల మందికి చికిత్స

కళలు, సంస్కృతుల ఖిల్లా గంజాం జిల్లా అని, స్వాతంత్య్ర పోరాటాల పోరుగడ్డ ఇదని ఉటంకించారు. ప్రముఖ సాహితీవేత్తలు కవిసామ్రాట్‌ ఉపేంద్ర భంజ్‌, కవిసూర్య బలదేవ్‌ రథ్‌లకు నివాళులర్పించారు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, బిజు స్వాస్థ్య కల్యాణ యోజన కింద గంజాం జిల్లాలో ఇంతవరకూ యాభై వేల మందికి చికిత్స అందించామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లకన్నా అధికంగా ఖర్చు చేసిందన్నారు. జిల్లాలో 630 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకుగాను 471 పాఠశాలల్ని 5టీ కింద ఆధునికీకరించామని, మిగిలిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ డిసెంబరులోగా ఆయా పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. రానున్న అయిదేళ్లలో రూ.50 వేల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని, ‘ఎస్‌హెచ్‌జీ’లు ‘ఎస్‌ఎంఈ’లు ఎదిగేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. రైతులకు వడ్డీలేని రూ.లక్ష రుణం ఇస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో 5టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ పాల్గొన్నారు. మంత్రులు ఉషాదేవి (గృహ, పట్టణాభివృద్ధి శాఖ), శ్రీకాంత్‌ సాహు (కార్మిక శాఖ), బ్రహ్మపుర, అస్కా ఎంపీలు చంద్రశేఖర్‌ సాహు, ప్రమీలా బిశోయి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర బిజద నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బిజద కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.


భాజపా నల్లజెండాల ప్రదర్శన

నినాదాలు చేస్తున్న భాజపా నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాం జిల్లా పర్యటనను భాజపా యువమోర్చా నాయకులు వ్యతిరేకించారు. ఛత్రపురంలో నవీన్‌ పర్యటిస్తుండగా నల్లజెండాలు ఊపి, నినాదాలు చేశారు. పోలీసులు ముప్ఫై మంది యువమోర్చా నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తరువాత విడిచిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని