logo

సరకు రవాణాలో సరికొత్త రికార్డు

సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే మరో రికార్డుని సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాదిలో 200 మిలియన్‌ టన్నులకు పైగా సరకును లోడింగ్‌ చేసిన ఘనత దక్కించుకుంది.

Published : 27 Mar 2023 01:58 IST

రెండోసారి 200 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని పూర్తి చేసిన తూర్పు కోస్తారైల్వే

గూడ్స్‌ రైలులో లోడు చేస్తున్న బొగ్గు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే మరో రికార్డుని సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాదిలో 200 మిలియన్‌ టన్నులకు పైగా సరకును లోడింగ్‌ చేసిన ఘనత దక్కించుకుంది. రైల్వే జోన్‌ వర్గాలు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు 232.32 మి.టన్నుల సరకుని తూర్పుకోస్తా జోన్‌ రవాణా చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొద్ది రోజులు సమయమున్న నేపథ్యంలో రవాణా 240మి.టన్నులకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. 2021-22లో 223.64 మి.టన్నులను లోడు చేసిన జోన్‌ ఈ సారి మరింత సరకుని రవాణా చేయడం గమనార్హం. భారత రైల్వేలో వరుసగా 220, 230 మి.టన్నులకు పైగా సరకు రవాణా చేసిన జోన్‌గా తూర్పుకోస్తా నిలిచింది.

 పెరిగిన ఆదాయం..

సరకు రవాణా ద్వారా 2021-22లో రూ.22,184.85 కోట్లు సంపాదించిన జోన్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.23,872.69 కోట్లు ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం 7.6 శాతం పెరిగినట్లు జోన్‌ వెల్లడించింది. జోన్‌ పరిధిలోని మూడు డివిజన్లకు చెందిన రైల్వే సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించడంతో పాటు రైల్వే జీఎం మనోజ్‌ శర్మ సహకారంతో ఇదంతా సాధ్యపడినట్లు అధికారులు పేర్కొన్నాయి. ఈ రికార్డుని సొంతం చేసుకోవడంలో ఓడ రేవులు, ఉక్కు అల్యూమినా, సిమెంట్‌ తదితర పరిశ్రమలతో పెట్రోలియం సంస్థలు, భారత ఆహార సంస్థల పాత్ర ఎంతో ఉందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని