logo

బడ్జెట్‌ రూపకల్పనలో కార్పొరేటర్లను విస్మరిస్తే ఎలా?

బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.601,85,30,675ల బడ్జెట్‌ను రూపొందించింది.

Published : 30 Mar 2023 03:27 IST

మండలి సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ సొనాల్‌. చిత్రంలో మేయరు దొళాయి, ఎమ్మెల్యే బిక్రం పండా, ఉప మేయరు వివేక్‌ రెడ్డి ఇతర అధికారులు

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.601,85,30,675ల బడ్జెట్‌ను రూపొందించింది. దీనిపై బుధవారం సాయంత్రం బీఈఎంసీ కార్యాలయం ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో మేయరు సంఘమిత్ర దొళాయి అధ్యక్షతన వార్డు కార్పొరేటర్లతో బడ్జెట్‌ సమావేశం జరిగింది. బీఈఎంసీ కమిషనర్‌ జె.సొనాల్‌ బడ్జెట్‌ ఆదాయ, వ్యయాల వివరాలను వెల్లడించారు. తొలుత 34వ వార్డు కార్పొరేటరు టి.త్రిపతి పాత్ర్‌ (బిజద) స్పందించారు. బడ్జెట్‌ రూపొందించే ముందు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించకుండా, అధికారులతో బడ్జెట్‌ తయారు చేయడం వల్ల స్థానికంగా తాము సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి కమిషనర్‌ సొనాల్‌, బీఈఎంసీ మేయరు దొళాయిలు స్పందిస్తూ ఇకపై జాగ్రత్తలు తీసుకుంటామని బదులిచ్చారు. మండలి సమావేశంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలు, చందనియా కొండ ప్రాంతం అభివృద్ధి, నగరంలోని చెరువులు, వెండింగ్‌ జోన్‌ల అభివృద్ధి, గిరిమార్కెట్‌లో షాపింగ్‌ మాల్‌, డ్రైనేజీ వ్యవస్థకు మాస్టర్‌ ప్లాన్‌ తదితర అంశాలపై చర్చించారు. బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రం కుమార్‌ పండా, బీఈఎంసీ ఉప మేయరు ఈ.వివేక్‌ రెడ్డి, ఉప కమిషనర్లు బినోద బెహర, ఆశీర్వాద్‌ పరిడా, బీఈడీఏ కార్యదర్శి సంబిత్‌ రౌత్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తరుణ్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధికి సహకరించాలి

సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: వర్షాకాలం రాకముందే మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. సునాబెడ పురపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం బుధవారం ఉపాధ్యక్షురాలు రీతు కంట అధ్యక్షతన కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురామ్‌ పడాల్‌, పురాధ్యక్షులు రాజేంద్ర కుమార్‌ పాత్ర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించారు. 25 వార్డుల్లో ముక్తా పథకం సక్రమంగా అమలు చేయాలని, సిమిలిగుడ, సునాబెడ ప్రాంతాల్లోని మహానేతల విగ్రహాలకు మరమ్మతులు చేసి, సుందరంగా తీర్చిదిద్దాలని సమావేశంలో తీర్మానించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని