logo

‘నకిలీ ధ్రువపత్రాల రాకెట్‌లో బిజద పెద్దలు’

నకిలీ ధ్రువపత్రాల తయారీ, అమ్మకాల వ్యవహారంలో బిజద పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉందని భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి బుధవారం శాసనసభ శూన్యగంటలో ఆరోపించారు.

Published : 30 Mar 2023 03:29 IST

మోహన్‌ మాఝి, నర్సింగ మిశ్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: నకిలీ ధ్రువపత్రాల తయారీ, అమ్మకాల వ్యవహారంలో బిజద పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉందని భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి బుధవారం శాసనసభ శూన్యగంటలో ఆరోపించారు. ఐటీ శాఖ కార్యదర్శి మనోజ్‌ మిశ్ర, మాజీ మంత్రి, బట్లీ (బిజద) ఎమ్మెల్యే సుశాంత సింగ్‌లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని, మరికొంతమంది నాయకులూ ఉన్నారని పేర్కొన్నారు. బొలంగీర్‌ నుంచి కొంధమాల్‌ వరకు అన్ని జిల్లాల్లో ఈ ధ్రువపత్రాల తయారీ, విక్రయించే ముఠాలున్నాయని, అధికార పార్టీ పెద్దల అండతో ఈ కార్యకలాపాలు సాగుతున్నాయని, దీనివల్ల ప్రతిభ గల విద్యార్థుల భవితవ్యం అంధకారమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభా పక్షం (సీఎల్పీ) నేత నర్సింగ మిశ్ర మాట్లాడుతూ... నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తీవ్రమైనదని, సొమ్ము చెల్లిస్తే అన్నిరకాల ధ్రువపత్రాలు ఇస్తున్న ముఠాలను అరికట్టకపోతే చదువులకు సార్ధకత ఉండదని, విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. బిజద ఎమ్మెల్యే భాగీరథీ శెఠి మాట్లాడుతూ... ఎక్కడ ఏం జరిగినా బిజద నేతల ప్రమేయం ఉందని విపక్షాలు ఆరోపించడం సరికాదన్నారు. నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, త్వరలో వాస్తవాలు బహిర్గతం అవుతాయని పేర్కొన్నారు.

ఇంకెన్నాళ్లు దర్యాప్తు

మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య ఘటనపై దర్యాప్తు ఇంకెన్నాళ్లని నర్సింగ మిశ్ర శూన్యగంటలో ప్రశ్నించారు. క్రైంబ్రాంచ్‌ ఇంతవరకు వివరాలు బయటపెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ హత్య కేసులో నిందితుడు గోపాల్‌దాస్‌ వరకే విచారించారని, ఈ ఘటన వెనక ఎవరెవరున్నారన్న కోణంలో ఎందుకు విచారణ సాగడం లేదని ప్రశ్నించారు. దీనిపై వాస్తవాలు చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని, పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒక క్యాబినెట్‌ మంత్రి హత్య ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం తగదని మిశ్ర పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని