logo

మే 10న ఝార్సుగుడ ఉప ఎన్నిక

కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) బుధవారం మధ్యాహ్నం ఝార్సుగుడ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించింది. మే 10న పోలింగ్‌, 13న ఓట్ల లెక్కించి అదేరోజు ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 13న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

Published : 30 Mar 2023 03:40 IST

బిజద అభ్యర్థినిగా దీపాలి దాస్‌?
భాజపా నుంచి టంకధర్‌ త్రిపాఠి?

ఝార్సుగుడ నియోజకవర్గం మ్యాప్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) బుధవారం మధ్యాహ్నం ఝార్సుగుడ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించింది. మే 10న పోలింగ్‌, 13న ఓట్ల లెక్కించి అదేరోజు ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 13న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభ కానుంది.


మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యతో

ఝార్సుగుడ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఆరోగ్యశాఖ మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ జనవరి 29న హత్యకు గురయ్యారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది వ్యవధి ఉండడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీ ప్రకటించింది.


మాజీ మంత్రి కుమార్తెకు అవకాశం?

ఝార్సుగుడలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో సందడి ప్రారంభమైంది. బిజద అభ్యర్థినిగా మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ కుమార్తె దీపాలి దాస్‌  బరిలో దిగుతారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధికారికంగా త్వరలో ఆమె పేరు ప్రకటించే అవకాశం ఉంది. దీపాలి బుధవారం ఝార్సుగుడలో విలేకరులతో మాట్లాడుతూ... తమ తండ్రి శ్రాద్ధకర్మల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం తనను ఆశీర్వదించిన సంగతి గుర్తు చేశారు. ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.


భాజపా నుంచి టంకధర్‌?

ఇక్కడ భాజపా అభ్యర్థిగా పార్టీ యువనేత టంకధర్‌ త్రిపాఠి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆయన పేరు ప్రకటిస్తుందన్న అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

అసెంబ్లీ: ఝార్సుగుడ
నామినేషన్‌ దాఖలు ప్రారంభం: ఏప్రిల్‌ 13
దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20
పరిశీలన: 21
ఉపసంహరణకు అవకాశం: 24న
పోలింగ్‌: మే 10
ఓట్ల లెక్కింపు: 13
ఫలితం: అదేరోజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని