logo

నిరుపయోగంగా 97 శీతల గిడ్డంగులు: మంత్రి రాణేంద్ర

రాష్ట్రంలో 97 శీతల గిడ్డంగులు నిరుపయోగంగా ఉన్నాయని, వీటికి మరమ్మతులు చేస్తే సొమ్ము వృథా అవుతుందని వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ చెప్పారు.

Published : 30 Mar 2023 03:40 IST

రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌, సమీర్‌ రంజన్‌ దాస్‌, అతాను సవ్యసాచి నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 97 శీతల గిడ్డంగులు నిరుపయోగంగా ఉన్నాయని, వీటికి మరమ్మతులు చేస్తే సొమ్ము వృథా అవుతుందని వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ చెప్పారు. బుధవారం శాసనసభా కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి రాణేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 36 శీతల గిడ్డంగులు మాత్రమే వినియోగంలో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వెయ్యి సౌరశక్తి చాలిత గిడ్డంగుల నిర్మాణం ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), సహకార సంఘాలకు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నామని, గిడ్డంగులకు 70 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని, రైతుల ఉత్పత్తులు పాడవకుండా ఉండాలన్న తపనతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సౌరచాలిత గిడ్డంగుల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయించారని తెలిపారు. అన్నదాతల ప్రయోజనాలకు కట్టుబడ్డామన్న కేంద్ర పాలకులు వారి కోసం ఏమీ చేయడం లేదని, అన్ని రాయితీల్లో కోత విధించారని మంత్రి ఆరోపించారు.

గణితంలో వెనుకంజ

సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధామిచ్చిన విద్యాశాఖ మంత్రి 10వ తరగతి బాలబాలికలు గణితంలో వెనుకంజలో ఉన్నారని, సామాజిక, విజ్ఞాన శాస్త్రాల్లోనూ ప్రతిభ చూపలేకపోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్లస్‌ టు విద్యార్థులకు కూడా ఇదే విధానం అమలు చేస్తామని, త్వరలో వేళలు నిర్ధారిస్తామని వివరించారు.

5 కిలోల కోత అన్యాయం

సభ్యులడిగిన ప్రశ్నకు ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి అతాను సవ్యసాచి నాయక్‌ సమాధానమిస్తూ... కొవిడ్‌ సమయంలో పేద కుటుంబాల్లో (బీపీఎల్‌) ఒక్కొక్కరికి ప్రతి నెల 10 కిలోల బియ్యం కేటాయించిన కేంద్రం ఇటీవల 5 కిలోలు కోత విధించడం అన్యాయమన్నారు. దీని ప్రభావం ధాన్యం సేకరణపై పడిందని, మిగులు సరకు కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ చెబుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల మిగులు ధాన్యం కొనుగోలు ప్రశ్నార్థకమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నవీన్‌ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. క్వింటాలుకు రూ.2,930లు గిట్టుబాటు ధర చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలవడం లేదని వివరించారు. మిగులు ధాన్యం సేకరించి రైతులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలని విన్నవిస్తున్నామని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని