logo

నేత్రానందం..సీతారాముల కల్యాణం

పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా గురువారం గంజాం జిల్లాలోని రామాలయాల్లో రోజంతా విశేష కార్యక్రమాలు నిర్వహించారు

Updated : 31 Mar 2023 05:38 IST

నేత్రానందం..సీతారాముల కల్యాణం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా గురువారం గంజాం జిల్లాలోని రామాలయాల్లో రోజంతా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మపురలో గొల్లపల్లిలోని పురాతన రఘునాథ స్వామి మందిరం ఆధ్వర్యంలో మధ్యాహ్నం సీతారాముల కల్యాణం నేత్రానందంగా సాగింది. మందిరం ఆవరణలోని మండపంలో నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎం.రాజారావు, సంధ్య, ఎస్‌.స్వరూప్‌ దొర, సంయుక్త దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. వేద పండితులు ధర్మపురి శివప్రసాద్‌, వనమాలి రాజేష్‌, ధర్మపురి సంతోష్‌, ధర్మపురి వంశీ, నేరెళ్ల హరీష్‌ తదితరులు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించి, దేవతామూర్తులకు ముత్యాల తలంబ్రాలు వేశారు. అంతకుముందు ఉదయం ఉత్సవమూర్తులతో రథంపై తిరువీధి మహోత్సవం నిర్వహించారు. పాత బ్రహ్మపురలోని మార్తావీధిలో కొండపై కొలువైన పురాతన రామాలయంలో రోజంతా ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేశారు. మధ్యాహ్నం మందిరం ఆవరణలో వందలాది మందికి అన్నప్రసాదాలు ఏర్పాటయ్యాయి. స్థానిక ఆకులవీధి, కాపువీధి, గుసానినువాగాం తదితర ప్రాంతాల్లోని రామాలయాల్లో  వేడుకలు ఘనంగా చేపట్టారు.
గొల్లపల్లిలో రఘునాథ మందిరం ఆవరణలో సీతారాముల కల్యాణోత్సవంలో తాళిబొట్టు చూపుతున్న వేద పండితుడు


పూరీ తీరంలో శ్రీరాముని సైకత శిల్పం

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: సత్య, ధర్మవాక్య పాలకుడు శ్రీరామచంద్రుడు మానవాళికి ఆదర్శమూర్తి. గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో అవతార పురుషుని సైకత శిల్పం, అయోధ్య రామమందిరం తీర్చిదిద్దారు. ఇది సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని