logo

పెనుగాలుల బీభత్సం

ఉత్తరకోస్తాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్యూములో నింబస్‌ కారుమబ్బులు కమ్ముకోవడంతోపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, వర్షాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.

Published : 26 May 2023 05:28 IST

కలెక్టర్లకు నివేదికలు పంపాలన్న ఎస్‌ఆర్‌సీ

పూరీ జిల్లా పిప్పిలిలో కూలిన విద్యుత్తు స్తంభం

భువనేశ్వర్‌,పూరీ, ఢెంకనాల్‌, అనుగుల్‌, ఖుర్ధా, కటక్‌, జగత్సింగ్‌పూర్‌,  కేంద్రపడ, నయాగఢ్‌ జిల్లాల్లో చాలాచోట్ల చెట్లు విరిగాయి.  విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి తీగలు తెగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 2.30 నుంచి 4.30 వరకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే ; ఉత్తరకోస్తాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్యూములో నింబస్‌ కారుమబ్బులు కమ్ముకోవడంతోపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, వర్షాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.
గాలులు తీవ్రంగా వీచిన ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఓడ్రాఫ్‌, అగ్నిమాపక సిబ్బంది నేలకొరిగిన చెట్లు, కొమ్మలు యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. టాటా పవర్‌ ఉద్యోగులు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. సాయంత్రం ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) సత్యబ్రత సాహు పరిస్థితిని సమీక్షించారు. నష్టాల వివరాలు పరిశీలించి నివేదికలు వెంటనే సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

   28 వరకు ప్రభావం

పిప్పిలిలో రోడ్డుపై పడిన చెట్టు

కొన్నాళ్లుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కాలవైశాఖి వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... పశ్చిమ ఒడిశా మినహాయిస్తే మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తగ్గాయని చెప్పారు. పశ్చిమంలో 40 నుంచి 41 డిగ్రీలుగా ఉందని, శుక్రవారం పశ్చిమ ప్రాంతాలు మినహా 21 జిల్లాలపై కాలవైశాఖి ప్రభావం చూపుతుందన్న అంచనా ఉందన్నారు. 26న కేంఝర్‌, మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌, కొరాపుట్‌, రాయగడ, గజపతి, గంజాం, నయాగఢ్‌, ఖుర్దా, భద్రక్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, పూరీ, ఢెంకనాల్‌, కొంధమాల్‌, కలహండి, నవరంగపూర్‌, బొలంగీర్‌, నువాపడ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల పిడుగుపాట్లకు అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ నెల 28 వరకు కాలవైశాఖి రాష్ట్రంపై ప్రభావం చూపుతుందన్న అంచనా ఉందని దాస్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని